- సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధిపై సర్వత్రా ఆగ్రహం
- తాజాగా సుమోటోగా తీసుకోవాలంటూ సీజేఐకి ప్రముఖుల లేఖ
- లేఖ రాసిన వారిలో మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై సొంత I.N.D.I.A. కూటమిలోని నేతలు కూడా అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 262 మంది ప్రముఖులు భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ, మతపరమైన హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగం చేసినందున సుమోటోగా తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఉదయనిధి స్టాలిన్ ద్వేషపూరిత ప్రసంగం చేయడంతో పాటు ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారని ప్రస్తావించారు. ఉదయనిధి వ్యాఖ్యలు ఆందోళనకరమని, మెజార్టీ జనాభాకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించి, చట్టబద్ధ పాలనను అపహాస్యం చేసిందన్నారు. అందుకే సుమోటోగా స్వీకరించాలని సుప్రీం కోర్టును కోరుతున్నట్లు తెలిపారు. లేఖ రాసిన వారిలో 14 మంది మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ఎన్ ధింగ్రా తదితరులు సంతకాలు చేశారు.
సనాతన ధర్మం గురించి తెలియకుండా మాట్లాడొద్దు: ఉదయనిధికి భూమన హితవు
- సనాతన ధర్మాన్ని కరోనా, మలేరియా, డెంగీతో పోల్చిన ఉదయనిధి
- సనాతన ధర్మాన్ని నిర్మూలించకపోతే ప్రమాదమని వ్యాఖ్యలు
- ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించిన భూమన
- సనాతన ధర్మం అనేది ఓ మతం కాదని స్పష్టీకరణ
ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించారు.
సనాతన ధర్మం భయంకరమైన వ్యాధి వంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను భూమన ఖండించారు. సనాతన ధర్మం అనేది మతం కాదని, అదొక జీవన ప్రయాణం అని స్పష్టం చేశారు.
సనాతన ధర్మం విశిష్టత తెలియకుండా విమర్శించడం మంచిది కాదని హితవు పలికారు. సనాతన ధర్మాన్ని కులాలతో ముడివేసి విమర్శలు చేయడం వల్ల సమాజంలో దుష్పరిణామాలు చెలరేగే అవకాశం ఉంటుందని భూమన అభిప్రాయపడ్డారు.
టీటీడీ సమావేశం సందర్భంగా, దేశంలో సనాతన ధర్మ వ్యాప్తికి కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఉదయనిధిని అంతం చేస్తే రూ.కోటి నజరానా ఇస్తా: తెలంగాణ బీజేపీ నేత దిలీపాచారి
- సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తమిళనాడు మంత్రి స్టాలిన్
- ఉదయనిధి దేశద్రోహి అన్న దిలీపాచారి
- ద్రావిడం, సంస్కృతం అంటూ విభేదాలు సృష్టిస్తున్నారని మండిపాటు
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు తప్పుపట్టాయి. తాజాగా తెలంగాణలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జీ దిలీపాచారి మాట్లాడుతూ… ఉదయనిధి దేశద్రోహి అని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఉదయనిధిని నిర్మూలించిన వారికి కోటి రూపాయల నజరానా ఇస్తానని ప్రకటించారు. సామాజిక న్యాయానికి, సమానత్వానికి సనాతన ధర్మం ప్రతీక అని చెప్పారు.
దేశ ప్రజల మధ్య ఐకమత్యం కోసం బీజేపీ తాపత్రయ పడుతోందని… ద్రావిడం, సంస్కృతం అంటూ ప్రజల మధ్య విభేదాలను సృష్టించి, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఉదయనిధి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హిందువులంతా ఇప్పటికైనా ఏకతాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేవారిని క్షమించకూడదని చెప్పారు.
తన తలపై నజరానా.. ఉదయనిధి ఏమన్నారంటే..!
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రగడ జరుగుతోంది. సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్న ఉదయనిధిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యకు చెందిన సాధువు ఒకరు ఉదయనిధి తలను తెచ్చిచ్చిన వారికి రూ.10 కోట్ల నజరానా ఇస్తానని ప్రకటించారు. ఒకవేళ ఎవరూ ముందుకు రాకుంటే తానే స్వయంగా ఉదయనిధిని వెతికి పట్టుకుని ఆ పని పూర్తిచేస్తానని చెప్పారు. ఈ ప్రకటనపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం స్పందించారు.
తన తల అంటే ఆ సన్యాసికి ఎందుకు అంత ఇష్టమో తెలియదని ఉదయనిధి అన్నారు. రూ. పది కోట్లు ఎందుకు, పది రూపాయల దువ్వెన ఇస్తే తానే తన తల దువ్వుకుంటానని చెప్పారు. ఛాప్, స్లిట్ అనే పదాలకు తమిళంలో తల దువ్వుకోవడమనే అర్థం ఉంది. ఈ అర్థాన్ని వాడుకుంటూ సాధువు హెచ్చరికను ఉదయనిధి తేలిగ్గా తీసిపారేశారు. ఇలాంటి బెదిరింపులు తమ కుటుంబానికి కొత్తేంకాదన్నారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, మళ్లీ మళ్లీ అదే చెబుతానని స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ సాధువుకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఉదయనిధి ప్రశ్నించారు.