అంతా ఓకే… బొటనవేలు పైకెత్తి చూపిన చంద్రబాబు న్యాయవాది సిద్థార్థ లూథ్రా
- విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ
- ముగిసిన వాదనలు
- తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయమూర్తి
విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘంగా సాగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విచారణ ముగిసింది. వాదనలు పూర్తి కాగా, న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ లో ఉంచారు. కాగా, వాదనల అనంతరం కోర్టు బయటికి వచ్చిన చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయసంకేతం ఇచ్చారు. బొటనవేలు పైకెత్తి అంతా ఓకే అనే సంజ్ఞ చేశారు.
ఈ ఉదయం 8 గంటల నుంచి ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. ఓవైపు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టులో ఎంతో అనుభవం ఉన్న సిద్ధార్థ లూథ్రా… మరోవైపు సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు అనుమతితో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్వయంగా వాదనలు వినిపించారు. తన అరెస్ట్ అక్రమం అని ఆక్రోశించారు.
కాగా, చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. “నిన్న సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడలో చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నాం. నా న్యాయవాద వృత్తిలో ఏనాడూ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోలేదు” అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.