Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

ఆ పరిణామాలతో మాకు సంబంధం లేదు: చంద్రబాబు అరెస్ట్‌పై కేటీఆర్ వ్యాఖ్య

  • అది వారి తలనొప్పి.. తమకు సంబంధం లేదన్న కేటీఆర్
  • వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 90 స్థానాల్లో సులభంగా గెలుస్తుందని ధీమా
  • కేవీపీ, షర్మిల తెలంగాణవాదులమని చెప్పుకుంటున్నారని ఆగ్రహం
  • రేవంత్ తెలంగాణ వాది కాదని, రాష్ట్రానికి పట్టిన వ్యాధి అని వ్యాఖ్య
  • భారత్‌కు స్వతంత్రం ఇచ్చింది రిషిసునక్ అంటే ఎలా ఉంటుందో.. సోనియా తెలంగాణ ఇచ్చింది అంటే అలాగే ఉంటుందని చురకలు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై మాట్లాడేందుకు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. ప్రగతి భవన్‌లో ఆయన మంగళవారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్‌పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు. పక్క రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అది వారి తలనొప్పి అని, తమకు సంబంధం లేదన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 90 స్థానాలకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం అందించిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను తాము ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు చాలా స్పష్టత ఉందన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అయోమయంలో ఉన్నాయన్నారు. కేసీఆర్‌, బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అని, ప్రతిపక్షాల నుండి ఎవరో చెప్పాలన్నారు. వారు ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లు తెస్తారన్నారు. తెలంగాణ ప్రజలు ఢిల్లీకి బానిసలు కారన్నారు.

కేవీపీ, షర్మిల తాము తెలంగాణవాదులమని చెప్పుకుంటున్నారని, కానీ వారు రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారన్నారు. అలాంటి వారు కాంగ్రెస్‌ను గెలిపిస్తారట అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేని కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజల పైకి రైఫిల్ తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముసుగులో వచ్చారన్నారు. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న కేవీపీ, షర్మిల, కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏకమవుతున్నారని విమర్శించారు. వీరితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ అణచివేసే ప్రయత్నం చేశారన్నారు.

రేవంత్ తెలంగాణవాది కాదని, రాష్ట్రానికి పట్టిన వ్యాధి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కరైనా ఉద్యమంలో ఉన్నారా? రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. భారత దేశానికి స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వారు అని ఆ దేశ ప్రధాని రిషి సునక్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని కాంగ్రెస్ అంటే అలాగే ఉంటుందన్నారు. నల్ల చట్టాలు తెచ్చే బీజేపీ కావాలా? జీవితాన్ని వెలుగుమయం చేసే బీఆర్ఎస్ కావాలా? ప్రజలు నిర్ణయించుకుంటారన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన పార్టీలు ఇప్పుడు అధికారం కావాలంటున్నాయన్నారు. బీజేపీ చెబుతోన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఓ గిమ్మిక్కు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ అవగాహనతో ఉన్నాయన్నారు.

Related posts

కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలుకు సమయం కోరిన ఏపీ… తోసిపుచ్చిన ట్రైబ్యునల్

Ram Narayana

కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలంటూ ఎంపీ వద్దిరాజు దంపతుల పూజలు…

Ram Narayana

బిగ్ బాస్ సీజన్-7 విన్నర్… ‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్

Ram Narayana

Leave a Comment