- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- చంద్రబాబు కేసును వాదిస్తున్న సిద్థార్థ లూథ్రా
- గురు గోబింద్ సింగ్ ప్రవచనాలను సోషల్ మీడియాలో పంచుకున్న వైనం
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ కాగా… ఆయన కేసును సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తున్న సంగతి తెలిసిందే.
చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కోర్టు ప్రొసీడింగ్స్ కోసం నిద్ర లేకుండా ఎదురుచూసిన ఆయన… కనీసం విశ్రాంతి తీసుకోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో వాదనలు వినిపించారు. అక్కడినుంచి ప్రతిరోజు కోర్టులో వాదనలు వినిపిస్తూనే ఉన్నారు.
తాజాగా, సిద్ధార్థ లూథ్రా ఎక్స్ లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఇవాళ్టి నినాదం ఇదే అంటూ గురు గోబింద్ సింగ్ ప్రవచనాలను పంచుకున్నారు.
“అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ న్యాయం కనుచూపు మేరలో కనిపించకపోతే… ఇక చేతిలోకి కత్తి తీసుకుని శక్తి ఉన్నంతవరకు పోరాడడమే మార్గం” అని ఆ ప్రవచనాలలో గురు గోబింద్ పేర్కొన్నారు. నాడు ఔరంగజేబ్ ను ఉద్దేశించి గురు గోబింద్ సింగ్ రాసిన జాఫర్ నామాలో ఈ ప్రవచనాలు ఉన్నాయి
రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసిన సిద్ధార్థ లూథ్రా
- కోర్టులో జరిగిన పరిణామాలను చంద్రబాబుకు వివరించినట్లుగా సమాచారం
- కేంద్రకారాగారం వద్దకు రాగానే కారును గేటు బయట నిలిపేసిన పోలీసులు
- కారు దిగి లోపలకు నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ లూథ్రా
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఆయన తరఫున వాదనలు వినిపిస్తోన్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రాజమండ్రి కేంద్రకారాగారంలో కలిశారు. చంద్రబాబుతో ములాఖత్ సమయంలో కోర్టులో జరిగిన పరిణామాలను చంద్రబాబుకు ఆయన వివరించారని తెలుస్తోంది. అలాగే, బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సిద్ధార్థ లూథ్రా సాయంత్రం కేంద్రకారాగారం వద్దకు రాగానే పోలీసులు ఆయన కారును గేటు బయట ఆపేశారు. దీంతో ఆయన కారు దిగి లోపలకు నడుచుకుంటూ వెళ్లారు.
చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఆయన కుటుంబాన్ని కలిసిన సిద్ధార్థ లూథ్రా
- చంద్రబాబుతో ములాఖత్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించిన న్యాయవాది
- ఆరున్నర గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్న లూథ్రా
- న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చ!
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును జైల్లో కలిసిన అనంతరం ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా… చంద్రబాబు కుటుంబంతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేతతో జరిగిన ములాఖత్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ తర్వాత ఆయన సాయంత్రం గం.6.30 సమయానికి ఢిల్లీకి బయలుదేరనున్నారు.
కోర్టులో జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణ తదితర అంశాలపై చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై వారు చర్చించారని సమాచారం. ఆ తర్వాత మీడియాతో మాట్లాడకుండా నేరుగా చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిశారు.