- వినాయకచవితి రోజున ఎయిర్ ఫైబర్ ప్రారంభించిన జియో
- గిగాబైట్ స్పీడ్ తో ఇంటర్నెట్ సాధ్యమంతున్న టెలికాం దిగ్గజం
- ఎలాంటి వైర్లు లేకుండానే ఇంటర్నెట్
- 550కి పైగా డిజిటల్ టీవీ చానళ్లు, 16కి పైగా ఓటీటీ యాప్ లు లభ్యం
వినాయకచవితి పర్వదినం సందర్భంగా రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. డీటీహెచ్ తరహాలో ఎయిర్ ఫైబర్ ద్వారా నేరుగా వినియోగదారుడి ఇంటికే ఇంటర్నెట్ సిగ్నల్స్ అందుతాయి. అందుకోసం జియో ఫిక్స్ డ్ వైర్ లెస్ యాక్సెస్ (ఎఫ్ డబ్ల్యూఏ) టెక్నాలజీని వినియోగిస్తోంది.
కాగా, తొలి విడతలో జియో తన ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ సేవలను దేశంలోని 8 నగరాల్లోనే అందిస్తున్నట్టు వెల్లడించింది. ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా, చెన్నై, పూణే నగరాల్లో ఎయిర్ ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎలాంటి వైర్లు అవసరం లేకుండానే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తరహా వేగంతో ఇంటర్నెట్ పొందవచ్చని జియో తన ప్రకటనలో వివరించింది. ట్రూ 5జీ టెక్నాలజీని ఉపయోగించుకుని అల్ట్రా హైస్పీడ్ ఇంటర్నెట్ తమ ఎయిర్ ఫైబర్ తో సాధ్యమవుతుందని పేర్కొంది. ఎయిర్ ఫైబర్ తో గిగాబైట్ స్పీడ్ తో ఇంటర్నెట్ లభిస్తుందని జియో స్పష్టం చేసింది.
జియో ఎయిర్ ఫైబర్ తో పాటు 550కి పైగా డిజిటల్ టీవీ చానళ్లు, రికార్డింగ్ సౌకర్యం, 16కి పైగా ఓటీటీ యాప్ లు లభిస్తాయి. ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించనవసరంలేకుండా వైఫై రౌటర్, 4కే స్మార్ట్ సెట్ టాప్ బాక్స్, వాయిస్ యాక్టివ్ రిమోట్ కంట్రోల్ అందిస్తారు.
జియో ఎయిర్ ఫైబర్ కోసం దగ్గర్లోని రిలయన్స్ దుకాణానికి వెళ్లడం కానీ, లేకపోతే జియో వెబ్ సైట్ ను సందర్శించడం కానీ చేయాలి. తమ వివరాలతో రిజిస్టర్ చేసుకున్నవారికి ప్రాధాన్యతా క్రమంలో ఎయిర్ ఫైబర్ అమర్చుతారు. జియో రూ.599 నుంచి వివిధ ధరల శ్రేణితో ప్లాన్లు కూడా తీసుకువచ్చింది.