- యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స
- జన్యుమార్పిడితో సిద్ధం చేసిన పంది గుండెను మనిషికి అమర్చిన వైనం
- రోగి వేగంగా కోలుకుంటుండటంతో ఆశ్చర్యపోతున్న వైద్యులు
- రాబోయే కొన్ని వారాలు అత్యంత కీలకమని వ్యాఖ్య
- గతేడాది ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ఆపరేషన్ నిర్వహించిన యూనివర్సిటీ వైద్యులు
అమెరికా వైద్యులు మరోసారి పంది గుండెతో మనిషి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు అవయవమార్పిడి శస్త్రచికిత్స ద్వారా రెండోసారి జన్యుమార్పిడి చేసిన పంది గుండెను మనిషికి అమర్చారు. మరణం అంచులకు చేరుకున్న 58 ఏళ్ల వ్యక్తిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. అయితే, శస్త్రచికిత్స తరువాత రోగి వేగంగా కోలుకోవడం వైద్యులనే ఆశ్చర్యపరుస్తోంది. ఆపరేషన్ జరిగిన రెండో రోజునే రోగి ఉత్సాహంతో ఉరకలెత్తుతూ జోకులు వేయడం ప్రారంభించాడని వారు తెలిపారు.
అనారోగ్య కారణాలు, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా రోగిలో పంది గుండె అమర్చాల్సి వచ్చిందని వైద్యులు వివరించారు. అయితే, రానున్న కొన్ని వారాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. గతేడాదే ఈ యూనివర్సిటీ వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా ఓ పంది గుండెను డేవిడ్ బెన్నెట్ అనే రోగికి అమర్చి రికార్డు సృష్టించారు. అయితే, ఆపరేషన్ జరిగిన రెండు రోజులకే బెన్నెట్ మృతి చెందాడు.