షూటర్ ఇషా సింగ్ అరుదైన రికార్డు..నాలుగు పతకాలు
- నేడు రెండు రజతాలు నెగ్గిన యువ షూటర్
- ఈ క్రీడల్లో 4 పతకాలు సాధించిన భారత మహిళా షూటర్ గా రికార్డు
- భారత్ ఖాతాలో మరో ఐదు పతకాలు
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో హైదరాబాద్ కు చెందిన యువ షూటర్ ఇషా సింగ్ అద్భుత ప్రదర్శన చేసింది. బుధవారం ఓ స్వర్ణం, రతజం సాధించిన ఆమె ఈ రోజు మరో రెండు రజతాలు సొంతం చేసుకుంది. దాంతో, ఆసియా క్రీడల షూటింగ్ చరిత్రలో నాలుగు పతకాలు గెలిచిన భారత తొలి మహిళా షూటర్ గా రికార్డు నెలకొల్పింది. ఈ ఉదయం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ లో హైదరాబాద్ కు చెందిన ఇషా సింగ్ తో పాటు పాలక్, దివ్యతో కూడిన భారత జట్టు రజతం నెగ్గింది. ఫైనల్లో ఈ త్రయం 1731 స్కోరుతో రెండో స్థానం సాధించింది. చైనా 1736 స్కోరుతో స్వర్ణం గెలవగా.. చైనీస్ తైజీ జట్టు కాంస్యం గెలిచింది.
కాగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రెండో స్థానంతో రజతం గెలవగా, పాలక్ స్వర్ణం ఖాతాలో వేసుకుంది. మరోవైపు పురుషుల రైఫిల్ 3 పొజిషన్ల విభాగంలో భారత జట్టు స్వర్ణం గెలిచింది. ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ సురేశ్, అఖిల్ షెరాన్ తో కూడిన పురుషుల జట్టు 1769 స్కోరుతో అగ్ర స్థానంతో బంగారు పతకం గెలిచింది. పురుషుల డబుల్స్ టెన్నిస్ లో ఫైనల్లో ఓడిన తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని, రామ్ కుమార్ రామనాథన్ ద్వయం రజతం సాధించింది. మొత్తంగా శుక్రవారం భారత్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించింది.