- కేపీహెచ్ బీ కాలనీలో ఏర్పాటైన లులూ మాల్
- మాల్ లో 75 దేశీ, విదేశీ బ్రాండెడ్ స్టోర్లు
- రూ. 500 కోట్లతో మాల్ ఏర్పాటు
హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో ఇటీవలే ప్రారంభమైన లులూ మాల్ కు కస్టమర్లు పోటెత్తుతున్నారు. ఈ మాల్ దెబ్బకు జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మెయిన్ రోడ్డు మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మరోవైపు ఇసుకవేస్తే రాలనంతగా వస్తున్న కస్టమర్లను చూసి మాల్ యాజమాన్యం సైతం విస్తుపోతోంది. బెక్ లు, కార్లు పెట్టడానికి కూడా పార్కింగ్ దొరకడం లేదు. మాల్ లోని స్టాల్స్ మొత్తం ఖాళీ అయిపోయాయి. ఎక్కడ చూసినా చాకొలేట్ కవర్లు, ఫుడ్ కవర్లు, ఖాళీ కూల్ డ్రింగ్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి.
యూఏఈకి చెందిన ఈ మాల్ ను మంత్రి కేటీఆర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ మాల్ లో 75 దేశీ, విదేశీ బ్రాండెడ్ స్టోర్లు ఉన్నాయి. సినిమా ప్రియుల కోసం 5 స్క్రీన్లు ఉన్నాయి. 1,400 మంది సినిమాలను వీక్షించేలా ఏర్పాట్లు సదుపాయాలు ఉన్నాయి. నిత్యావసర వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, మొబైల్, పండ్లు, కూరగాయలు, మాంసం ఇలా అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. పిల్లల కోసం ఎంటర్ టైన్ మెంట్ జోన్ కూడా ఉంది. రూ. 500 కోట్ల పెట్టుబడితో ఈ మాల్ ను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే బెంగళూరు, కోయంబత్తూర్, తిరువనంతపురం, లక్నో, కొచ్చిలలో ఈ మాల్స్ ఉండగా… తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ మాల్ ను వైజాగ్ లో ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ మాల్ ఏపీ నుంచి తెలంగాణకు తరలివచ్చింది.