మీకో రహస్యం చెబుతున్నా, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ వచ్చి నన్ను కలిశారు: ప్రధాని మోదీ
- కేసీఆర్ తనను కలిసి ఎన్డీయేలో చేరుతానని చెప్పారన్న ప్రధాని మోదీ
- కేటీఆర్‌ను ఆశీర్వదించాలని తనకు చెప్పారని వ్యాఖ్య
- ఇది రాజరికం కాదని, ప్రజలు ఆశీర్వదిస్తే పాలకులు అవుతారని కేసీఆర్‌తో చెప్పానన్న మోదీ
- తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని హామీ
- ప్రపంచానికి కరోనా వ్యాక్సీన్ అందించిన ఘనత తెలంగాణదేనని వ్యాఖ్య
- తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానం చేస్తే ఒక కుటుంబం దోచుకుంటోందని ఆరోపణ
- తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హాట్ హాట్ గా మార్చిన ప్రధాని
మరికొద్ది రోజుల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికల షడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటనలు ముమ్మరమైయ్యాయి. రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని తిరిగి మంగళవారం రాష్ట్రానికి వచ్చి నిజామాబాద్ లోని ఇందూరు గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు .జి హెచ్ ఎం సి ఎన్నికల అనంతరం తనదగ్గరకు వచ్చిన కేసీఆర్ తాను ఎన్డీయే చేరతానని , తన కుమారుడిని అశ్విరదించాలని కోరారని ఇప్పటివరకు ఎక్కడ వెలుగు చూడని రహస్యాన్ని బయట పెట్టి కేసీఆర్ ను విరుకున పెట్టారు . ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ యస్ ,బీజేపీ ఒక్కటేనని విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో కేసీఆర్ పై స్వయంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు బ్రహ్మాస్త్రాలుగా మారాయి. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ హాట్ గా మారాయి..
ప్రధాని సభలో ఏమన్నారంటే ….
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ వచ్చి తనను కలిశారని, ఎన్డీయేలో చేరుతానని చెప్పారని ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ప్రధాని ఇందూరు గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇంతకుముందు చెప్పని రహస్యం ఇవాళ చెబుతున్నానని, కేసీఆర్ తనను కలిసి ఎన్డీయేలో చేరుతానని చెప్పారని, కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారని అన్నారు. అయితే ఇది రాజరికం కాదని, బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పానన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పానని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరఫున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించినట్లు చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఆసుపత్రులు, రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిందన్నారు. భరతమాత రూపంలో ఈ సభకు వచ్చిన వారందరికీ మోదీ అభినందనలు తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో రావడం తన అదృష్టమన్నారు. తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు ఓట్ల రూపంలో బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.
తెలంగాణ ప్రజల్లో ఎంతో శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయన్నారు. ప్రపంచానికి కరోనా వ్యాక్సీన్ అందించిన ఘనత హైదరాబాద్‌దే అన్నారు. ఎంతోమంది బలిదానంతో తెలంగాణ ఏర్పడిందని, కానీ ఓ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకుంటోందన్నారు. కేసీఆర్, ఆయన కొడుకు, మేనల్లుడు, కూతురు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ధనికులయ్యారని ఆరోపించారు. ఈ కుటుంబ పాలనకు తెలంగాణ యువత మరోసారి అవకాశం ఇవ్వవద్దని పిలుపునిచ్చారు.
కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న విషయం మోదీ వ్యాఖ్యలతో నిజమని తేలింది: మాణికం ఠాగూర్
- జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిశారన్న ప్రధాని మోదీ
- ఇన్నాళ్లుగా ఇది రహస్యంగా ఉందని వెల్లడి
- కేటీఆర్ ను ఆశీర్వదించాలని కూడా కేసీఆర్ కోరారని స్పష్టీకరణ
- మోదీ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు
- ఇదే విషయాలను రేవంత్ రెండేళ్లుగా చెబుతున్నారన్న మాణికం ఠాగూర్
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ తనను కలిశారని ప్రధాని మోదీ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుగా ఈ విషయం రహస్యంగా ఉందని మోదీ తెలిపారు. కేటీఆర్ ను ఆశీర్వదించాలని కూడా కేసీఆర్ తనను కోరారని ప్రధాని వివరించారు. దీనిపై రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న సంగతి మోదీ వ్యాఖ్యలతో బట్టబయలైందని తెలిపారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజమని తేలిందని పేర్కొన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ కోరుకున్నది నిజం అని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రెండేళ్లుగా ఇదే విషయం చెబుతున్నారని వెల్లడించారు.