- గోవా నుంచి రెండు పెంపుడు కుక్క పిల్లలను తెచ్చుకున్న రాహుల్
- అందులో ఒకదాన్ని తల్లికి బహుమతిగా ఇచ్చిన
కాంగ్రెస్ అగ్రనేత - దానికి నూరీ అని పేరు పెట్టినట్టు వెల్లడి
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం తన కొత్త కుటుంబ సభ్యుడిని సోషల్ మీడియాకు పరిచయం చేశారు. గోవా నుంచి తెచ్చుకున్న పెంపుడు కుక్క పిల్ల నూరీ ఫొటోను షేర్ చేశారు. దీన్ని తన తల్లి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చినట్టు వెల్లడించారు. ఆగస్టులో గోవా పర్యటనకు వెళ్లిన రాహుల్.. అక్కడ ఇద్దరు దంపతులు నిర్వహిస్తున్న కుక్కల పెంపక కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన రెండు కుక్క పిల్లలు నచ్చడంతో విమానంలో ఒకదాన్ని తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో శునకాన్ని కూడా తెప్పించుకున్నారు.
తన వెంట తీసుకెళ్లిన ఆడ కుక్క పిల్లకు నూరీ అని పెట్టారు. దాన్ని నేరుగా తన ఇంటికి వెళ్లి తల్లి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చారు. కుక్కపిల్ల బాగుందన్న సోనియా దానితో ఆడుకున్నారు. అప్పటికే ఇంట్లో ఉన్న మరో కుక్కపిల్లతో నూరీ కలిసిపోయి ఆడుకుంటోంది. గోవాలో కుక్కల పెంపక కేంద్రానికి వెళ్లిన దగ్గరి నుంచి నూరీని తనతో పాటు తీసుకెళ్లి సోనియా గాంధీకి ఇవ్వడం వరకూ రూపొందించిన వీడియోను రాహుల్ ఈ రోజు ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా తన యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేశారు.