- బీపీ 120/80 కు మించకుండా చూసుకోవాలి
- ఇంతకు మించి ఉంటుంటే అది హైపర్ టెన్షన్
- ఆహారం, జీవనశైలిలో మార్పులతో నియంత్రణ
బ్లడ్ ప్రెజర్ (బీపీ/రక్తపోటు) నేడు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. గుండె నుంచి బలంగా రక్తాన్ని పంప్ చేసినప్పుడు, అది ధమనుల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. ఆ సమయంలో ధమనులపై పడే ఒత్తిడిని రక్తపోటుగా చెబుతారు. ఇలా గుండె సంకోచ, వ్యాకోచ సమయంలో ఉండే రక్తపోటును సిస్టాలిక్, డయాస్టాలిక్ గా చెబుతారు. రక్తపోటు సాధారణంగా 120/80కు మించకుండా ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన స్థాయి. పరిమితికి మించి కొనసాగితే దీర్ఘకాలంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
120/80 కంటే తక్కువ ఉంటే దాన్ని సాధారణ స్థాయిగా చెబుతారు. సిస్టాలిక్ రేటు 120-129 మధ్య, డయాస్టాలిక్ రేటు 80 కంటే తక్కువ ఉంటే దాన్ని ఎలివేటెడ్ గా చెబుతారు. వీరికి ఔషధాలు సూచించరు. జీవన శైలిలో మార్పులు, ఆహారంలో మార్పులను సూచిస్తారు. వీరికి హై బ్లడ్ ప్రెజర్ కేటగిరీలోకి వెళ్లే రిస్క్ ఉంటుంది. ఇక సిస్టాలిక్ 130-139 మధ్య ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ గ్రేడ్ 1గా చెబుతారు. డయాస్టాలిక్ 80-89 మధ్య ఉంటే గ్రేడ్ 1 కిందకు వస్తారు. వీరికి ఆహారం, జీవనశైలిలో మార్పులు, వ్యాయామం సూచనలతో పాటు రక్తపోటును తగ్గించే ఔషధాలను సూచిస్తారు. సిస్టాలిక్ 140, డయాస్టాలిక్ 90 ఉంటే దీన్ని రెండో గ్రేడ్ హైపర్ టెన్షన్ గా చెబుతారు. ఇంతకంటే ఎక్కువ రీడింగ్ వస్తుంటే దాన్ని హైపర్ టెన్సివ్ క్రైసిస్ గా పేర్కొంటారు.
ఇందులో సిస్టాలిక్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇది ఎక్కువగా ఉంటే గుండె జబ్బుల రిస్క్ పొంచి ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ధమనుల గోడలపై కొవ్వు ఫలకాలు చేరినా, ధమనుల గోడలు కుచించుకుపోతున్నా బీపీ పెరుగుతుంది.
ఏవి తినొచ్చు?
- పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్, ముడి ధాన్యాలు తినాలి.
- డాష్ డైట్ ను ఫాలో అవ్వాలి.
- పొటాషియం ఎక్కువగా ఉండే అప్రికాట్, అవకాడో, మెలన్స్ పండ్లను ఎక్కువగా తినాలి.
- కొవ్వు లేని, తక్కువ కొవ్వుతో కూడిన డైరీ ఉత్పత్తులు, పాలకూర, ఆకుపచ్చని కూరలు, చేపలు తినాలి.
- పుట్ట గొడుగులు, నారింజ పండ్లు, ఆలుగడ్డ, ప్రూన్, కిస్ మిస్, డేట్స్, టమాటోలను తీసుకోవాలి.
- ఫ్లాక్స్ సీడ్ సైతం రక్తపోటును నియంత్రిస్తుంది.
- దానిమ్మ పండు రసం, మందార పువ్వుతో చేసుకున్న టీ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఏవి తినొద్దు..?
ప్రాసెస్డ్ ఫుడ్స్, శాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న పదార్థాలు, ఉప్పు, వేయించిన పదార్థాలు, సోడియం ఎక్కువగా ఉన్న ఆహారం, ప్రాసెస్ చేసిన మీట్ తినకుండా ఉండడం మంచిది. రోజువారీ 30 నిమిషాలు వేగవంతమైన నడక, రోజులో 8 గంటలు గాఢ నిద్ర రక్తపోటున తగ్గిస్తాయి.