మీడియా స్వేచ్ఛను హరిస్తే…
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే
హైద్రాబాద్ లో భారీ మౌనప్రదర్శన..పాల్గొన్న ప్రముఖులు ,జర్నలిస్టులు
- ఐజేయూ, టీయూడబ్ల్యూజే సభలో వక్తల ఆందోళన
పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరిగిన దాడులను గర్హిస్తూ హైదరాబాదులో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, టీయూడబ్ల్యూజే దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నాడు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ సర్కిల్ లో ఐజేయూ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. కేంద్రంలో ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ మీడియా మీద, పౌర సంస్థల మీద ఉక్కుపాదం మోపడం సహించారనిదన్నారు. న్యూస్ క్లిక్ పోర్టల్ కార్యాలయంపై, అందులో పని చేస్తున్న 47 మంది జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు దాడులు జరిపిన తీరు దిగ్బ్రాంతి కలిగిస్తున్నదన్నారు. ఎందుకు సోదాలు జరుపుతున్నారో, ఎందుకు అరెస్టులు చేస్తున్నారో తెలపకుండా చీకటి రోజులను గుర్తు చేసే విధంగా ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వ్యవహరించారని వారు ఆరోపించారు. కఠినమైన ఉపా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్తున్న పోలీసులు ముందుగా ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయడం లేదో చెప్పడం లేదని ఆరోపించారు. చైనా పెట్టుబడులను బూచిగా చూపి ప్రజాస్వామ్యాన్ని హరించాలని చూస్తున్నారని ఆరోపించారు. కారణం చెప్పకుండా అరెస్టు చేయడం ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమేనని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
కే.సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ హయాంలో 1975లో ప్రకటిత ఎమర్జెన్సీ అమలు కాగా నేడు నరేంద్ర మోడీ పాలనలో అప్రకటి ఎమర్జెన్సీని అమలు చేస్తూ ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల నేత, ప్రముఖ రచయిత ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ దేశంలో కొనసాగుతున్న నిర్బంధకాండ ప్రమాదకర పరిస్థితులను సూచిస్తోందని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ లేని బతుకు అర్థరహితమని, దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు.
సుప్రసిద్ధ పాత్రికేయుడు కె రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్ లు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వాతంత్ర్యంపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించడానికి జర్నలిస్టులంతా సమైక్య పోరాటం సాగించాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పారు.
నగరంలో గర్జించిన జర్నలిస్టులు
- ఐజేయూ, టీయూడబ్ల్యూజే
ప్రదర్శన గ్రాండ్ సక్సెస్
మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వ ఉక్కుపాదాన్ని నిరసిస్తూ, గురువారం నాడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జర్నలిస్టులు గర్జించారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబర్దార్, ఢిల్లీ పోలీసుల వైఖరిని ఖండిస్తున్నాం, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుదాం, రాజ్యాంగ హక్కులను గౌరవిద్దాం అంటూ జర్నలిస్టులు చేసిన నినాదాలు మారుమ్రోగాయి. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)ల నేతృత్వంలో, హెచ్.యూ.జే, హైదరాబాద్ ప్రెస్ క్లబ్, నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా ఇండియా, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ చిన్న, మధ్యతరహా పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ ల భాగస్వామ్యంతో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుంది. ఆయా ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించాయి. అనంతరం ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన అంబెడ్కర్ విగ్రహం వద్ద సభ జరిగింది. ఈ ప్రదర్శన, సమావేశంలో సుప్రీం కోర్టు మాజీ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్ చంద్రకుమార్, ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్లు జి.హరగోపాల్, కోదండరాం, పి.ఎల్.విశ్వేశర్ రావు, పద్మజషా, ఖాసీం, సీనియర్ సంపాదకులు
కే.రామచంద్ర మూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, విశాలాంధ్ర సంపాదకులు ఆర్.వి.రామారావు, సియాసత్ సంపాదకులు అమీర్ అలీ ఖాన్, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, వీక్షణం వేణు, పాశం యాదగిరి, తోట భవనారాయణ, రహ్మాన్, ప్రముఖ రచయిత, గాయకులు జయరాజ్, సామాజిక నిపుణులు రమా మేల్కొటే, సజయ, ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండర్ జేఏసీ బాధ్యురాలు సంధ్య, ఓ.పి.డి.ఆర్ బాధ్యురాలు జయ వింధ్యాల, ఎన్.డబ్ల్యూ.ఎం.ఐ బాధ్యురాలు వనజ, సామాజిక కార్యకర్త జస్విన్ జైరత్, మానవ హక్కుల వేదిక బాధ్యులు జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ఐజేయూ నాయకులు ఎం.ఏ.మాజీద్, కల్లూరి సత్యనారాయణ, డి.కృష్ణారెడ్డి, హెచ్.యూ.జె అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, షౌకత్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు ఏ.రాజేష్, బి.కిరణ్, మల్లయ్య, యం.వెంకట్ రెడ్డి, చిన్న, మధ్యతరహా పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, హరి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు జి.బాల్ రాజ్, న్యూడెమోక్రసీ బాధ్యుడు గోవర్ధన్ లతో పాటు 300 మంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.