Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఇరాన్ మానవ హక్కుల కార్యకర్తకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి

  • ఇరాన్ లో మహిళల అణచివేతపై గళం వినిపిస్తున్న నర్గీస్ మహమ్మది
  • 2023 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక
  • అధికారికంగా ప్రకటించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఇరాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గీస్ మహమ్మది ఎంపికయ్యారు. గత కొన్ని రోజులుగా వివిధ రంగాల్లో నోబెల్ అవార్డులు ప్రకటిస్తున్నారు. ఇవాళ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కార విజేతను ప్రకటించారు. 

ఇరాన్ లో మహిళల అణచివేతపై ఎలుగెత్తిన నర్గీస్ మహమ్మది 2023 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి విజేత అని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛ అనే అంశాలపై నర్గీస్ చేస్తున్న పోరాటాన్ని కూడా గుర్తిస్తున్నట్టు నోబెల్ కమిటీ తెలిపింది.

51 ఏళ్ల నర్గీస్ మహమ్మది డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ కు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 2022లో బీబీసీ టాప్-100 మహిళల జాబితాలోనూ ఆమె చోటు దక్కించుకున్నారు. ఛాందస వాద సిద్ధాంతాలతో పాలించే ఇరాన్ వంటి దేశంలో ఓ మహిళ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడం అనేది ఆత్మహత్యా సదృశంగా భావించాలి. అలాంటి దేశంలోనూ ప్రాణాలకు తెగించి, తోటి మహిళల స్వేచ్ఛ కోసం నర్గీస్ చేస్తున్న పోరాటం అంతర్జాతీయంగా గుర్తింపుకు నోచుకుంది. 

ఇరాన్ ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శించినందుకు గాను ఆమెను 1998లో అరెస్ట్ చేయగా, ఆమె ఏడాది పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు విపత్కర పరిస్థితుల నడుమ మనుగడ కొనసాగించారు. మానవ హక్కుల కోసం ఆమె సాగించే పోరాటాలు ఇరాన్ ప్రభుత్వానికి కంటగింపుగా మారడంతో పలుమార్లు కోర్టులు శిక్షలు విధించాయి. 

నర్గీస్ మహమ్మది ‘వైట్ టార్చర్: ఇన్ సైడ్ ఇరాన్స్ ప్రిజన్స్ ఫర్ ఉమెన్’ పేరిట ఇరాన్ జైళ్లలో మహిళల దుర్భర పరిస్థితులను కూడా పుస్తక రూపంలో బయటి ప్రపంచానికి తెలియజేశారు.

Related posts

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై పిడుగులు!

Ram Narayana

దావూద్ ఇబ్రహీం చచ్చిపోయాడా?.. ఛోటా షకీల్ ఏం చెప్పాడంటే!

Ram Narayana

అమెరికాకు ఓ హిందువు అధ్యక్షుడు అవ్వకూడదన్న ఓటర్.. వివేక్ రామస్వామి సమాధానం ఇదీ!

Ram Narayana

Leave a Comment