- 14 రోజులపాటు సేవలు అందించిన చంద్రయాన్-3
- విలువైన సమాచారాన్ని భూమికి పంపిన ప్రజ్ఞాన్, విక్రమ్
- వాటిని నిద్రలేపేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం
- భవిష్యత్తులో చంద్రుడి నుంచి నమూనాలు తెచ్చే ప్రయోగాలు ఉంటాయన్న ఇస్రో మాజీ చైర్మన్
చంద్రయాన్-3పై ఇస్రో శాస్త్రవేత్తలు ఆశలు వదిలేసుకున్నారు. నిద్రాణస్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపి పనిచేయించడం ఇక సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేసినట్టు సమాచారం. జాబిల్లిపై కాలుమోపి 14 రోజులపాటు పరిశోధనలు చేసి విలువైన సమాచారాన్ని సేకరించిన ఇవి రెండూ ఆ తర్వాత లూనార్ నైట్ (చంద్రుడిపై రాత్రి సమయం) ప్రారంభం కావడంతో నిద్రాణస్థితిలోకి వెళ్లిపోయాయి.
తిరిగి గత నెల 22న చంద్రుడిపై సూర్యోదయం కావడంతో వాటిని మళ్లీ నిద్రలేపి ప్రయోగాలకు పురమాయించాలని శాస్త్రవేత్తలు భావించారు. అప్పటి నుంచి వాటికి సిగ్నల్స్ పంపుతున్నా స్పందించడం లేదు. మళ్లీ లూనార్ నైట్ సమీపిస్తున్నా వాటిలో చలనం కనిపించకపోవడంతో ఇక దానిపై ఆశలు వదిలేసుకున్నారు.
నిజానికి అవి ఇప్పటికే మేల్కొనాల్సి ఉందని, కానీ ఆ పని జరగలేదంటే అవి ఇక నిద్రాణ స్థితి నుంచి బయటకు రావడం దాదాపు అసాధ్యమని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. దాని నుంచి రావాల్సిన సమాచారం ఇప్పటికే వచ్చేసిందని అన్నారు. చంద్రుడి నమూనాలను భూమికి తీసుకొచ్చే ప్రాజెక్టులు భవిష్యత్తులో ఉంటాయని పేర్కొన్నారు.