- కరోనాకు ఉచితంగా వ్యాక్సిన్ వేయలేని పరిస్థితి ఉంది
- జనాలపైన విపరీతమైన భారాన్ని మోపుతున్నారు
- అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు
కరోనాను కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందంటూ ఏపీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని అన్నారు. ప్రధాని మోదీ పబ్లిసిటీ పిచ్చికి జనాలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాలకు కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా వేయలేని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి జనాలపై భారాలు మోపుతున్నారని అన్నారు.
కరోనా కష్టకాలంలో పేదలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. మోదీ తరహాలోనే జగన్ కూడా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని అన్నారు. దేశానికి ఏపీ మార్గదర్శకంగా ఉందంటూ జగన్ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అవాస్తవాలను ప్రచారం చేస్తూ జనాలను మోసం చేస్తున్నారని విమర్శించారు.