- కరీంనగర్ లో బీజేపీ ప్రజాశీర్వాద సభ
- మతం పేరుతో చిచ్చుపెట్టేందుకు అనేకమంది యత్నిస్తున్నారన్న కేటీఆర్
- మోదీ ఎవరికి దేవుడో చెప్పాలని వ్యాఖ్యలు
- గంగులపై పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టేనని వెల్లడి
కరీంనగర్ లో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు అనేకమంది ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎప్పుడూ మతం పేరుతో రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు.
కరీంనగర్ నుంచి గెలిచిన ఎంపీ ఏ ఒక్క పనైనా చేశారా? అని పరోక్షంగా బండి సంజయ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మోదీ ఎవరికి దేవుడో బండి సంజయ్ చెప్పాలని ప్రశ్నించారు. మోదీ చెప్పిన రూ.15 లక్షలు వచ్చిన వారు బీజేపీకి, రైతు బంధు వచ్చిన వారు బీఆర్ఎస్ కు ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇక, కరీంనగర్ లో గంగుల కమలాకర్ పై పోటీ అంటేనే పారిపోతున్నారని, గంగులపై పోటీ చేస్తే ఏం జరుగుతుందో కాంగ్రెస్, బీజేపీకి బాగా తెలుసని ఎద్దేవా చేశారు. గంగులపై కరీంనగర్ లో పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టేనని చమత్కరించారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ పాలనలో కరీంనగర్ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. రాష్ట్రాన్ని ఢిల్లీ పాలకుల చేతిలో పెడితే నాశనమవుతుందని అన్నారు. కరీంనగర్ లో మేం ఎన్ని పనులు పూర్తి చేశామో చూడాలి… కరీంనగర్ లో తాగునీటి సమస్యను పరిష్కరించాం అని కేటీఆర్ వెల్లడించారు. మళ్లీ అధికారంలోకి వస్తే పింఛను రూ.5 వేలు చేస్తామని చెప్పారు. వెయ్యి గురుకులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో పల్లెలు బాగుపడుతున్నాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు.