Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

దొరల తెలంగాణ …ప్రజల తెలంగాణ కు మధ్య ఎన్నికలు …ములుగు సభలో రాహుల్ గాంధీ

దొరల తెలంగాణ …ప్రజల తెలంగాణ కు మధ్య ఎన్నికలు …ములుగు సభలో రాహుల్ గాంధీ
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని తెలిసిన రాష్ట్రన్ని ఇచ్చింది సోనియా
ఇచ్చిన తెలంగాణ దొరల చేతుల్లో బందీ అయిందని విమర్శ
బీజేపీ ,బీఆర్ యస్ ,ఎంఐఎం ఒక్కటే …
సీఎం కేసీఆర్ అవినీతి అక్రమాలపై ఈడీ ,సిబిఐ , ఇన్ కం టాక్స్ ఎలాంటి దాడులు జరపవు
వారి మధ్య అందుకుకారణం …
తెలంగాణాలో సామాజిక న్యాయం ఎక్కడ …ముగ్గురు కుటుంబసభ్యుల చేతుల్లో 18 శాఖలు ..ప్రియాంక గాంధీ
50 శాతం ఉన్న బీసీలకు కేవలం మూడు మంత్రి పదవులు ..
ఇదేనా సామజిక న్యాయం …
రాష్ట్రంలో ల్యాండ్ ,సాండ్ ,మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుంది..

దొరల తెలంగాణ …ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు …బుధవారం సాయంత్రం ములుగు జిల్లాలో జరిగిన సభలో ప్రియాంక గాంధీ తో కలిసి పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీ, బీఆర్ యస్ ఎంఐఎం పార్టీలు ఒక్కటే అని వారికీ కాంగ్రెసును ఓడించడమే లక్ష్యమని వారి ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు …బీఆర్ యస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని ప్రజల బలిదాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ దొరల చేతులో బందీ అయిందని విమర్శలు గుప్పించారు . సీఎం కేసీఆర్ అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డ కేంద్రంలోని బీజేపీ సర్కార్ సిబిఐ, ఈడీ , ఇన్ కం టాక్స్ సంస్థల ద్వారా ఎలాంటి దాడులు జరిపించలేదని అదే బీజేపీ ,బీఆర్ యస్ మధ్య బంధానికి తార్కాణమని అన్నారు .

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చిందని వెల్లడించారు. సాధారణంగా రాజకీయ పార్టీలు తమకు నష్టం కలిగే నిర్ణయాలు తీసుకోవని, కానీ తాము అన్నింటికీ సిద్ధపడే తెలంగాణ ఇచ్చామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నాడు నష్టం జరుగుతుందన్న ఆలోచనే లేకుండా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలన్నదే నాడు తమ ఆలోచన అని వివరించారు.

ఇక, తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు కాలం చెల్లిందని అన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినట్టు రాహుల్ విమర్శించారు. నిరుద్యోగ యువతను కేసీఆర్ వంచించారని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రూ.1 లక్ష రుణ మాఫీ అన్నారని, అదైనా గుర్తుందా, లేదా? అంటూ నిలదీశారు.

బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి చోటుచేసుకుందని రాహుల్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్లు జేబులో వేసుకున్నారని, ధరణి పోర్టల్ లోనూ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అభివృద్ధి అనే గ్యారెంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చెప్పామో అదే చేశామని, తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని పేర్కొన్నారు. రాజస్థాన్ లో ఉచిత వైద్యం, కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పామని, ఆ మేరకు అమలు చేస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే పోడు భూములు, అసైన్డ్ భూముల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

బీఆర్ యస్ పాలనలో రాష్ట్రం లూటీ …ప్రియాంక గాంధీ
ఒక్క కుటంబంతోనే మూడు మంత్రి పదవులు …18 మంత్రిత్వ శాఖలు
50 శాతం ఉన్న బీసీలకు కేవలం మూడు మంత్రిపదవులు
సామాజికన్యాయం లేదు ..,27 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లు 23 తగ్గించారు .

రాజకీయ మూల్యం చెల్లించి మరీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, తాము నష్టపోతామని తెలిసినప్పటికీ తెలంగాణ ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో ఆమె మాట్లాడుతూ… కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్న మీ కల నెరవేరిందని, కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సామాజిక న్యాయం కొరవడిందన్నారు.

తెలంగాణ వస్తే యువత ఆత్మహత్యలు ఆగుతాయని, రైతుల జీవితాలు బాగుపడతాయని భావించారని, కానీ బీఆర్ఎస్ పాలనలో అవేమీ జరగలేదన్నారు. మీ ఆశలను అడియాసలు చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా తాము తెలంగాణను ఇచ్చామన్నారు. నెహ్రూ నుంచి సోనియా వరకు అందరూ దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించినట్లు చెప్పారు. ఇప్పటికైనా మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వరికి రూ.2500, మొక్కజొన్నకు రూ.2200 మద్దతు ధర ఇస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ భరోసా కింద రూ.15వేలు ఇస్తామన్నారు.

ఈసభకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులూ పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహించగా , రాష్ట్ర కాంగ్రెస్ వ్యవరాల ఇంచాగే మాణిక్యరావు ఠాక్రే , పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు ,పొదెం వీరయ్య , సీతక్క , జగ్గారెడ్డి , మాజీ మంత్రి జానారెడ్డి ,బలరాం నాయక్ , కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు .

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ కార్డులకు రామప్ప ఆలయంలో పూజలు చేసిన రాహుల్, ప్రియాంక

తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ఓవైపు అధికార బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలతో జోరు పెంచగా, కాంగ్రెస్ పార్టీ కూడా పోటాపోటీగా సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నేడు ములుగులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు.

కాగా, ఈ సభకు వచ్చే ముందు రాహుల్, ప్రియాంక ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో తమ ప్రచార అస్త్రాలుగా పేర్కొంటున్న ఆరు గ్యారెంటీ కార్డులను రామప్ప ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ములుగు సభకు బయల్దేరారు. 1.మహాలక్ష్మి 2. రైతు భరోసా 3. గృహజ్యోతి 4. ఇందిరమ్మ ఇళ్లు 5. యువ వికాసం 6. చేయూత గ్యారెంటీలను ఇటీవల కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే.


జాతీయ పండుగగా సమ్మక్క సారలమ్మ జాతర ….

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని అందుకు కావాల్సిన ఏర్పాట్లు కేంద్రమే చేస్తుందని రాహుల్ ప్రజల హర్షద్వానాలమధ్య హామీ ఇచ్చారు … 

Related posts

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య

Ram Narayana

అచ్చంపేటలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అస్వస్థత

Ram Narayana

ఆ గిన్నెలను కూడా నాకి నాకి సర్ఫ్ అవసరం లేకుండా చేశారు: బీఆర్ఎస్ నాయకులపై జగ్గారెడ్డి

Ram Narayana

Leave a Comment