- అగ్రరాజ్యంలో తొలి సిక్కు మేయర్ గా రవీందర్ ఎస్ భల్లా రికార్డు
- న్యూజెర్సీ రాష్ట్రంలోని హోబోకెన్ సిటీ మేయర్ గా 2021 లో ఎన్నికైన భల్లా
- తాజాగా బెదిరింపు లేఖలు వస్తున్నాయని మీడియాకు వెల్లడించిన మేయర్
మేయర్ పదవికి వెంటనే రాజీనామా చేయకుంటే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు వస్తున్నాయని అమెరికన్ సిక్కు లీడర్ రవీందర్ ఎస్ భల్లా మీడియాకు తెలిపారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని హోబోకెన్ సిటీ మేయర్ గా 2017 లో తొలిసారి ఎన్నికైన భల్లా.. అమెరికాలోనే తొలి సిక్కు మేయర్ గా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2021లోనూ ఆయన మరోసారి మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే, ఇటీవల గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు లేఖలు వస్తున్నాయని భల్లా ఆరోపించారు. వెంటనే మేయర్ పదవికి రాజీనామా చేయాలని ఆ లేఖలలో డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు తనకు మూడు లేఖలు అందాయని వివరించారు.
‘మేయర్ గా ఎన్నికైంది నేను.. అధికార బాధ్యతలు చూసేది, నిర్ణయాలు తీసుకునేది కూడా నేనే. మధ్యలో నా భార్యాపిల్లలు ఏంచేశారు? వారిని చంపుతానని బెదిరించడమేంటి?’ అంటూ భల్లా మీడియాతో వాపోయారు. అమెరికా పౌరుడిగా దేశంలో అందరూ సమానమేనని, అందరినీ ఒకేలా చూడాలని అనుకుంటానని భల్లా చెప్పారు. అలాగే అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నదే తన అభిప్రాయమని వివరించారు. బెదిరింపు లేఖలు అందుకోవడం దురదృష్టకరమని, తన కుటుంబ భద్రత గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని భల్లా చెప్పారు.