- ఎల్ సాల్వెడార్ కు భారత్, ఆఫ్రికా నుంచి వలసలు
- అక్కడి నుంచి సరిహద్దుల ద్వారా అక్రమంగా అమెరికాలోకి చొరబాట్లు
- వీటికి చెక్ పెట్టేందుకే నూతన పన్ను
సెంట్రల్ అమెరికా దేశమైన ఎల్ సాల్వెడార్ భారత్, దక్షిణాఫ్రికా నుంచి తమ దేశానికి వస్తున్న ప్రతి ఒక్క పర్యాటకుడిపై 1,000 డాలర్ల పన్ను విధిస్తోంది. అంటే సుమారు రూ.83వేలు. ఎందుకంటే చాలా మంది ఎల్ సాల్వెడార్ కు చేరుకుని, అక్కడి నుంచి అక్రమ మార్గాల్లో యూఎస్ కు వలసపోతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకే ఎల్ సాల్వెడార్ ప్రత్యేక పన్నును తీసుకొచ్చింది.
భారత పాస్ పోర్ట్ లేదా 57 ఆఫ్రికా దేశాల్లో ఏ దేశం నుంచి వచ్చినా, 1,000 డాలర్ల పన్ను చెల్లించాల్సి ఉంటుందని అక్కడి పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. ఇలా వసూలయ్యే నిధులతో ఎయిర్ పోర్ట్ నిర్మించనున్నారు. అక్రమ వలసలను నిరోధించే విషయమై అమెరికా సహాయ మంత్రి బ్రియాన్ నికోలస్ తో ఎల్ సాల్వెడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే భేటీ అయ్యి చర్చలు సైతం నిర్వహించారు.
2023 సెప్టెంబర్ తో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరికి అమెరికా వ్యాప్తంగా 32 లక్షల మంది అక్రమ వలసవాదులు ఉన్నట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ విభాగం గుర్తించింది. పోర్టులు, ఎయిర్ పోర్టులు సైతం అక్రమ వలసవాదుల సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుందని ప్రకటించింది. తాజాగా విధించిన పన్ను వ్యాట్ తో కలిపితే మొత్తం 1,130 డాలర్లు (రూ.93,790).