- కొత్త ప్రభాకర్ రెడ్డిపై కుట్ర పూరితంగా దాడి జరిగిందన్న మల్లారెడ్డి
- కాంగ్రెస్, బీజేపీలు రౌడీలకు టిక్కెట్లు ఇచ్చాయని ఆరోపణ
- రాత్రి ఎనిమిది గంటలకు ప్రభాకర్ రెడ్డికి ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడి
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కుట్ర ప్రకారమే దాడి జరిగిందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రశాంతంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీలు రౌడీలకు టిక్కెట్లు ఇచ్చాయన్నారు. దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఇటీవలే వెళ్లినట్లు ప్రచారం సాగుతోందన్నారు. కావాలనే ప్లాన్ చేసి కత్తితో దాడి చేశారన్నారు. ప్రభాకర్ రెడ్డి పేగుకు గాయమైందన్నారు. రాత్రి ఎనిమిది గంటలకు ఆపరేషన్ చేయవలసి ఉంటుందని డాక్టర్లు చెప్పారన్నారు. మైనంపల్లి హన్మంతరావు తనను కూడా బెదిరిస్తున్నారని మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై కూడా దాడి జరుగుతుందని భయంగా ఉందన్నారు.
దాడి గర్హనీయం : మంత్రి గంగుల కమలాకర్
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గర్హనీయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఓడిపోతున్నామనే అక్కసుతో ప్రతిపక్షాలు దాడులకు తెగబడుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదన్నారు. కేసీఆర్ జనరంజక పాలనతో రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ రానుందని, తమకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు దాడులకు పాల్పడడం దారుణమన్నారు. నీచ రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు గమనించాలన్నారు.