కమ్యూనిస్టులకు సీట్లు కేటాయింపుపై కాంగ్రెస్ మెలిక..ఒంటరి పోటీకి సిద్ధపడుతున్న సిపిఎం!
కొత్తగూడెం , మిర్యాలగూడం పై క్లారిటీ అంటూనే రెండవసీటుపై రానిస్పష్టత …
సిపిఐ కి కొత్తగూడెం ,చెన్నూరు …తర్వాత చెన్నూరుకు బదులు కార్వాన్ అంటూ లీకులు
సిపిఎం కు వైరా అంటూనే మలక్ పేట అంటూ లీకులు
పాలేరు పై పట్టుబట్టిన సిపిఎం ..తన అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
మిర్యాలగూడెం ,వైరా సిపిఎం కు …సిపిఐ కి కొత్తగూడెం , చెన్నూరు అంటూ ప్రచారం
కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందంటూనే వారు అడిగిన నాలుగు సీట్లు కాకుండా కాంగ్రెస్ సూచించిన సీట్లలో పోటీచేయాలని చెప్పడంతో పొత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. కాంగ్రెస్ పొత్తు …పొత్తు అంటూనే ఏ ఏ సీట్లు కేటయించాలనే విషయంలో మెలిక పెట్టడంపై కమ్యూనిస్టుల్లో అసహనానికి కారణమవుతుంది… కాంగ్రెస్ నుంచి వాస్తవంగా రెండు కమ్యూనిస్టులు చెరొక ఐదు సీట్లు కావాలని కాంగ్రెస్ ముందు తమప్రతిపాదనలు పెట్టాయి… చర్చోప చర్చలు జాతీయ పార్టీల జోక్యంతో చివరకు చేరాక రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..కానీ తీరా వారు ప్రతిపాదిస్తున్న సీట్లలో చెరొకటి వారు కోరుకున్న సీట్లు కాగా మరొకటి కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకని చోట్ల లేదా కాంగ్రెస్ కు ఏమాత్రం బలంలేని గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని మలక్ పేట సిపిఎం కు , కార్వాన్ సిపిఐ కి ఇవ్వాలనే ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం…దీంతో లెఫ్ట్ నేతలు కాంగ్రెస్ వైఖరిపై గుర్రుగా ఉన్నారు …కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా తాము అడిగిన సీట్లలో రెండు ఇవ్వకపోతే ఇక పొత్తుకు అర్ధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ..
వాస్తవంగా లెఫ్ట్ పార్టీలకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అంతో ఇంతో పలుకుబడి ఉంది.. 30 నుంచి 40 నియోజకవర్గాల్లో 5 నుంచి 10 వేల ఓట్లు ఉంటాయని అంచనా…ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం 8 నియోజకవర్గాల్లో ఉంటుంది.. దీంతో ఆపార్టీలు తాము కోరుకున్న సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నాయి…
వారంరోజుల క్రితం సిపిఐ కి కొత్తగూడెం తోపాటు , ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత చూపింది…దానికి సిపిఐ నాయకత్వం కూడా కొత్తగూడెం , చెన్నూరుకు ఒకే తెలిపింది … ఈ మధ్యకాలంలో ఏమిజరిగిందో తెలియదు కానీ చెన్నూరుకు బదులు కార్వాన్ వచ్చిచేరడం సిపిఐ నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.. ఇక సిపిఎం అడిగిన సీట్లలో మిర్యాలగూడెం ఒకే అన్నప్పటికీ రెండవ సీటుగా పాలేరు అడిగితె మొదటి సుముఖత చూపిన కాంగ్రెస్ ఆసీటును ఆపార్టీ ప్రచార కమిటీ కో .చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించింది…చివరకు వైరా ఇస్తామని ప్రకటించింది…సరే దానికి కూడా దిగివచ్చిన సిపిఎం కు ప్రస్తుతం మలక్ పేట అసెంబ్లీ సీటు ఆఫర్ చేయడనికి సిద్ధమైంది….తమకు బలమైన ఖమ్మం జిల్లాలో సీటు కేటాయించకుండా ఎక్కడో తాము అసలు ఆలోచన కూడా చేయని తమకు బలం ఎమాత్రంలేని సీటు ఇస్తే పోటీచేసే సమస్యే లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు ..చివరకు మిర్యాలగూడెం , వైరా ఇవ్వకపోతే తమదారి తమదేనని అల్టిమేటం ఇచ్చారు ..అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి సరైన రెస్పాన్స్ లేదు …దీంతో తమకు బలమున్న స్థానాల్లో ఒంటరిగా పోటీచేసేందుకు సిపిఎం సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది….