- నిందితుల ఆస్తులు అటాచ్ చేస్తామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వార్నింగ్
- ప్రతిపక్ష నేతలు, న్యాయవ్యవస్థను టార్గెట్ చేసేవారిపైనా చర్యలు ఉంటాయని హెచ్చరిక
- ఇప్పటికే పలు అకౌంట్స్ గుర్తించామని, త్వరలో ఆస్తులు అటాచ్ చేస్తామని వెల్లడి
- ఇప్పటివరకూ 2,972 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్స్ తెరిచామని వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని సీఐడీ చీఫ్ సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. పలు సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టామని తాజాగా జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించామని తెలిపారు. త్వరలో నిందితుల ఆస్తులు అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపైనా చర్యలు ఉంటాయని చెప్పిన ఆయన ఇప్పటికే కొన్నిటిని తొలగించామని వెల్లడించారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా పోస్టులు పెట్టినవారిపైనా చర్యలు తప్పవన్నారు.
సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యులపై పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ నేత కార్తీక్ రెడ్డి, సమరసింహారెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అకౌంట్స్‌ను గుర్తించామని సీఐడీ చీఫ్ వెల్లడించారు. విదేశాల నుంచి పెట్టే పోస్టుల విషయంలో ఎంబసీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 202 అకౌంట్లపై దృష్టి పెట్టామన్నారు. గత రెండు నెలల్లో కొత్తగా 31 సోషల్ మీడియా అకౌంట్స్ వచ్చాయని పేర్కొన్నారు. అసభ్య పోస్టుల షేరింగ్, లైక్స్ చేస్తున్న 2,972 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్స్ తెరిచినట్టు సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు.