-అమెరికా అధ్యక్ష ఎన్నికలను తలపించిన తానా ఎన్నికలు
-హోరా హోరి ప్రచారం -అమెరికాలో తెలుగువారి హడావుడి
-2023-25 కాలానికి అధ్యక్షుడిగా వ్యవహరించనున్న నిరంజన్
-ఎన్నికల్లో నిరంజన్ ప్యానల్‌దే గెలుపు
-2001లో అమెరికా వెళ్లి, 2003లో ఐటీ కంపెనీ నెలకొల్పిన నిరంజన్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నూతన కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ఎన్నికయ్యారు. 2023-25 కాలానికి గాను ఆయన తానా తదుపరి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం తానా ఫౌండేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నిరంజన్.. గతంలో పలు పదవులు నిర్వహించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికల్లో రెండు ప్యానల్స్ హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో అమెరికా లో తెలుగు వారి హడావుడి కనపడింది . రెండు ప్యానళ్లు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
తానా అధ్యక్షుడి ఎన్నిక కోసం ఇటీవల ఎన్నికలు జరగ్గా నిన్న లెక్కింపు పూర్తయింది. నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి. దీంతో నిరంజన్ ప్యానల్ విజయం సాధించింది. నరేన్ కొడాలికి తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, సతీశ్ వేమన వంటి వారి మద్దతు ఉన్నప్పటికీ ఆయన ప్యానల్ ఓటమి పాలైంది. కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలంలోని రాజానగరానికి చెందిన నిరంజన్ 2001లో అమెరికా వెళ్లారు. 2003లో ఐటీ కంపెనీ ప్రారంభించారు.