Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఎవరీ బర్రెలక్క.. రాష్ట్రంతో పాటు దేశమంతటా ఒకటే చర్చ!

  • కొల్లాపూర్ నుంచి అసెంబ్లీ బరిలో బర్రెలక్క
  • నిరుద్యోగుల గొంతుకగా నామినేషన్ దాఖలు
  • బెదిరింపులకు బయపడేది లేదంటున్న వైనంప్రాణం పోయినా పోరాటం ఆపబోనని శిరీష వెల్లడి

బర్రెలక్క … అలియాస్ శిరీష ఇప్పుడు ఈపేరు దేశ విదేశాల్లో మారుమోగుతోంది…ఒక సామాన్య కుటుంబంలో పుట్టి స్వశక్తితో డిగ్రీ చదివింది … తల్లికి చేదోడుగా నాలుగు బర్రెలను కొని తన కుటుంబాన్ని పోషిస్తున్న ఆమె రాష్ట్రంలో నిరుద్యోగుల అవస్తలపై చేసిన వీడియో హల్చల్ అయింది … ఆమెను ఒక సెలబ్రెటీని చేసింది…అంతే కాకుండా ఆమె నిరుద్యోగంపై పాలకులను ప్రశ్నిస్తూ కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడంతో ఆమెకు బెదిరింపులు వస్తున్నాయని ,తన సోదరుడిపై దాడి జరిగిందని తమకు రక్షణ కావాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు .. తనకు రక్షణకు పోలీసులను ఆదేశించాలని ఆమె రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించారు ..

సోషల్ మీడియాలో బర్రెలక్కగా ఫేమస్ అయిన కర్నె శిరీష (26) అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ సెగ్మెంట్ లో నామినేషన్ వేసిన శిరీషకు మద్దతు తెలిపే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో మిగతా అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. నిరుద్యోగుల గొంతుకగా ఎన్నికల్లో పోటీచేస్తున్న బర్రెలక్కకు బెదిరింపులు మొదలయ్యాయి. ప్రచారంలో ఆమెపై, ఆమె సోదరుడిపై దాడి జరిగింది. పోటీ నుంచి తప్పుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆఫర్లు వస్తున్నాయి. 

అయితే, ఈ ప్రలోభాలకు, బెదిరింపులకు, దాడులకు తాను భయపడబోనని బర్రెలక్క తేల్చి చెప్పింది. ప్రాణం పోయినా సరే పోరాటం ఆపబోనని స్పష్టం చేసింది. బర్రెలక్కపై దాడి జరగడంతో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బర్రెలక్కకు ఓటు వేసి గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాసంఘాల నేతలు, మేధావులు, ప్రజలు బర్రెలక్కకు అండగా నిలుస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆమె తరఫున ప్రచారం చేస్తున్నారు. దీంతో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కొల్లాపూర్ బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

శిరీష.. బర్రెలక్కగా ఎలా అయిందంటే..
కర్నె శిరీషది నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం.. తల్లి, ఇద్దరు తమ్ముళ్లతో కూడిన నిరుపేద కుటుంబం. తండ్రి వీరిని వదిలేసి వెళ్లాడు. దీంతో శిరీష తల్లి రోజు కూలీగా మారి కుటుంబాన్ని గెంటుకొస్తోంది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూనే కుటుంబానికి ఆసరగా ఉండేందుకు శిరీష కూడా కూలీ పనులకు వెళ్లేది. తల్లిని అడిగి నాలుగు బర్రెలను కొని, వాటి పాలు అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు తనలాంటి నిరుద్యోగుల ఆవేదనను జనాలందరికీ తెలిసేలా ఓ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇన్ స్టాలో సంచలనం సృష్టించింది. దేశవిదేశాల్లోని ఇన్ స్టా యూజర్లకు ఆమెను పరిచయం చేసింది. కర్నె శిరీషను బర్రెలక్కగా మార్చేసింది. వీడియో వైరల్ కావడం కొందరికి కంటగింపుగా మారింది. ఫలితంగా శిరీషపై కక్ష సాధింపునకు దిగారు. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాని కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం శిరీషకు ఇన్ స్టాలో 5.73 లక్షల మంది, ఫేస్ బుక్ లో 1.07 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్ లో 1.59 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

ప్రభుత్వ తీరుతో ఎన్నికల బరిలోకి..
వేధింపులపై ధైర్యంగా పోరాడుతున్న శిరీష అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. చేతిలో డబ్బులేకున్నా నిరుద్యోగుల గొంతుకగా నామినేషన్ వేసింది. అఫిడవిట్ లో ఆమె ఆస్తుల వివరాలు.. బ్యాంక్ ఖాతాలో రూ.1,500, చేతిలో రూ.5 వేలు ఉన్నట్లు వెల్లడించింది. తనకు సపోర్ట్ చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది. కొంతమంది నేరుగా ప్రచారానికి వస్తుండగా ఇంకొంత మంది తమకు తోచిన నగదు సాయం చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ఆమెకు మద్దతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. ప్రచారం కోసం డబ్బు సాయం, పాటలు రాసివ్వడం.. ఇలా ఏదో ఒక రకంగా మేధావులు మద్దతు తెలుపుతున్నారు.

పోటీ పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వం మనకెందుకు?
ఒక్కటంటే ఒక్క నియామక పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం ఎందుకంటూ బర్రెలక్క సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది తన సొంత నిర్ణయమని స్పష్టత నిచ్చారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, అప్పులు చేసి హైదరాబాద్ కు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారని చెప్పారు. తిండి లేకున్నా తిప్పలు పడుతూ కష్టపడి చదువుకుంటున్నారని, వారి బాధలు చెప్పడానికి మాటలు చాలవని శిరీష వివరించారు. పరీక్షలు సరిగా రాయకుంటే ఫెయిల్ చేస్తారు.. మరి పరీక్షలే సక్కగా పెట్టలేని ఈ ప్రభుత్వాలను ఏంచేయాలని ప్రశ్నించారు. ప్రచారంలో ప్రజల నుంచి తనకు బాగా సపోర్ట్ అందుతోందని శిరీష చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా నిరుద్యోగ సోదరులు వచ్చి తనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారని వివరించారు. ‘బర్రెలక్క ఒక్కతే పోటీ చేస్తే ఏం జరగదు. ఇది నా ఒక్కదాని సమస్య కాదు. రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగుల సమస్య. నిరుద్యోగ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎన్నికల్లో పోటీ చేయాలె. వాళ్ల ఇంటి నుంచే పోరాటం మొదలు కావాలె” అని శిరీష పిలుపునిచ్చా రు.

చంపుతామని బెదిరింపులు..
ఓ సామాన్య నిరుద్యోగి ఎన్నికల బరిలో నిలబడితే ఎందుకంత భయపడుతున్నారని ప్రధాన పార్టీల అభ్యర్థులను శిరీష నిలదీశారు. పోటీ నుంచి తప్పుకోకుంటే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, పొలిటికల్ పార్టీల లీడర్లు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎలక్షన్ల ముందు కుక్కకు బొక్క వేసినట్లు ఆశ చూపించడం కాకుండా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల వివరాలను వెల్లడించాలని శిరీష డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ వేసి, పారదర్శకంగా నియామకాలు జరపాలని, ఇదే తన మేనిఫెస్టో అని చెప్పారు. నామినేషన్ వేసినప్పటి నుంచి వేధింపులు మరింత పెరిగాయని తెలిపారు. ఫోన్లలో బెదిరింపులు, బూతులతో తిడుతున్నారు.. వారందరి వివరాలు జాగ్రత్త చేస్తున్నానని శిరీష చెప్పారు. ఎన్నికల తర్వాత వారి వివరాలు మీడియాకు వెల్లడిస్తానని శిరీష పేర్కొన్నారు.

బర్రెలక్క పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ

  • దాడి నేపథ్యంలో సెక్యూరిటీ కోసం కోర్టుకెక్కిన బర్రెలక్క
  • 2 ప్లస్ 2 గన్ మెన్లతో భద్రత కల్పించాలని విజ్ఞప్తి
  • విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు
Barrelakka Petition Files On High Court To Provide Security With 2 plus 2 Gunmen It Will Be Heard Today

కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తనకు భద్రత కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల ప్రచారంలో తన సోదరుడిపై దాడి జరగడంతో సెక్యూరిటీ అభ్యర్థించారు. అయితే, పోలీసులు తన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టుకెక్కారు. ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచి తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని, చంపేస్తామని ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు 2 ప్లస్ 2 గన్ మెన్లతో సెక్యూరిటీ కల్పించేలా పోలీసులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం దీనిపై విచారణ జరిపి నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని కోర్టు వర్గాల సమాచారం.

బర్రెలక్కకు అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు కావేట శ్రీనివాసరావు, కరణం రాజేశ్, ఆదిత్య దొడ్డల మద్దతు ప్రకటించారు. బర్రెలక్కపై, ఆమె సోదరుడిపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెదిరింపుల నేపథ్యంలో ఆమెకు 2 ప్లస్ 2 గన్ మెన్లతో సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన దాడిని ప్రస్తావిస్తూ హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీచేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు సానుకూలంగా స్పందించి బర్రెలక్కకు భద్రత కల్పించాలని తీర్పిస్తే దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పిలుపు

Ram Narayana

కేసీఆర్ కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పిన మంత్రి కేటీఆర్

Ram Narayana

కరటక దమనకులు” అంటే ఏమిటి…? కేసీఆర్ పద ప్రయోగంపై ఆరా ..!

Ram Narayana

Leave a Comment