- తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర పన్నారన్న పొంగులేటి
- బీఆర్ఎస్ పాలనను అంతమొందించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్య
- కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ
పాలేరులో తనను ఎలాగైనా ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నారని కాంగెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణను దొరల, దోపిడీ పాలన నుంచి కాపాడుకోవాలని చెప్పారు. సుస్థిర పాలనను అందించే కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సి ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం రాష్ట్రంలోని ప్రతి గుండె తపిస్తోందని అన్నారు.
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజల బతుకులు విచ్ఛిన్నమయ్యాయని చెప్పారు. పదేళ్ల కాలంలో దోచుకున్న లక్షల కోట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యేకు రూ. 300 కోట్లు పంపించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. కేసీఆర్ పంచే డబ్బు మనదేనని… ఆ డబ్బు తీసుకుని కాంగ్రెస్ కే ఓటు వేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.