- ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్న కేసీఆర్
- తాను పిలిస్తేనే రాజకీయాల్లోకి వచ్చారని వెల్లడించిన ముఖ్యమంత్రి
- ఖానాపూర్‌ను కేటీఆర్ దత్తత తీసుకుంటానని చెప్పారన్న కేసీఆర్
ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క వర్గం ప్రజలూ బాగుపడలేదని, ఆమె కాలంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖానాపూర్, జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఇందిరమ్మ హయాంలోనే అని, 400 మందిని కాల్చి చంపింది కూడా ఆమె హయాంలోనే అని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నీటిపై కూడా పన్ను విధిస్తే, దానిని తాము రద్దు చేశామని చెప్పారు.
ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ఆయనకు దేవుడు చాలా డబ్బులు ఇచ్చాడని, అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉందని తెలిపారు. తాను పిలిస్తేనే ఆయన రాజకీయాల్లో వచ్చారన్నారు. జాన్సన్ నాయక్‌ను గెలిపిస్తే ఖానాపూర్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదు.. సచ్చేది లేదని దాని పని మటాష్ అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ఈ పదేళ్లలో ఏం చేసిందో ఆలోచించి… ప్రజలు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓటు వేయవద్దని హెచ్చరించారు. “జాన్సన్ నాయక్ నా కొడుకు రామ్ (కేటీఆర్) కు క్లాస్‌మేట్. మొన్న రామ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఖానాపూర్‌ను దత్తత తీసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. ఇక రామారావు దత్తత తీసుకున్నాక మీకేం తక్కువవుతుంది? కాబట్టి మీరు జాన్సన్ నాయక్‌కు ఓటేస్తే నాకు వేసినట్టే లెక్క. మంచి మెజారిటీతో జాన్సన్ నాయక్‌ను గెలిపించండి” అని కోరారు. నీలాంటి యువకుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని చెబితే జాన్సన్ నాయక్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు.