Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా అని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాదులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత పెంచారు. గతంలో కంటే అధిక సంఖ్యలో పోలీసులను రేవంత్ ఇంటి వద్ద మోహరించారు.

పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, అంచనాలు అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్ నేతలు రేవంత్ ఇంటికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం అభ్యర్థి అనే ప్రచారం కూడా ఉండడంతో, ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా భద్రత పెంచినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ సంస్థలు కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ ను నింపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ… తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెవరకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని కొనియాడారు. మీ కష్టం, శ్రమ వృథా కాలేదని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిదని అన్నారు. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్ గెలుపు గుర్రాలను బెంగళూరు తరలించే అవకాశం…?

తెలంగాణ అధికార పీఠాన్ని కైవసం చేసుకునే పార్టీ ఏదనేది మరో రెండ్రోజుల్లో తేలనుంది. నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా, డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గెలుపుపై మొదటి నుంచి ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ… ఒకవేళ సంకీర్ణం వస్తే తన ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలన్న దానిపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది.

నిన్నటి ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కే మొగ్గు కనిపించినప్పటికీ, బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా సీట్లు గెలిచే అవకాశాలున్నట్టు కొన్ని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే… పార్టీ ఫిరాయింపుదారులే కీలకం అవుతారు. అందుకే, గెలిచే అవకాశాలున్న ఏ అభ్యర్థిని కూడా ఇతర పార్టీలోకి వెళ్లకుండా చూసేందుకు వీలుగా… కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్టు సమాచారం.

ఇందులో భాగంగానే తమ గెలుపు గుర్రాలను బెంగళూరు తరలించి, వారిని కొన్నిరోజుల పాటు కాపాడుకోవాలన్నది కాంగ్రెస్ ప్రణాళిక అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొందరు అభ్యర్థులు ఏ క్షణమైనా బెంగళూరు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ హైకమాండ్ నుంచి సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేక విమానాలను కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

ఒకవేళ కాంగ్రెస్ గనుక 70 సీట్ల కంటే తక్కువ గెలుచుకుంటే, తమ అభ్యర్థులను కచ్చితంగా బెంగళూరుకు తరలించే అవకాశాలు ఉన్నట్టు ఓ సీనియర్ నేత తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60. చాలా ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే… కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు పైన కొన్ని సీట్లు గెలిచే అవకాశమున్నట్టు తెలిపాయి. అందుకే, కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ఇద్దరు సమన్వయకర్తలను రాష్ట్రానికి పంపినట్టు తెలుస్తోంది. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులను గుర్తించి, వారు గెలుపు సర్టిఫికెట్లు అందుకున్న వెంటనే వారిని అజ్ఞాత ప్రదేశానికి తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్టు రాజకీయ వర్గాలు తెలిపాయి.

Related posts

సీఎం రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ ఫైర్

Ram Narayana

షర్మిల తప్పటడుగులు …విజయమ్మ సికింద్రాబాద్ నుంచి పోటీచేస్తారా …?

Ram Narayana

మేడిగడ్డను పరిశీలించిన రాహుల్‌గాంధీ.. దోపిడీని చూసేందుకే వచ్చానన్న కాంగ్రెస్ అగ్రనేత

Ram Narayana

Leave a Comment