- కాంగ్రెస్ 80కి పైగా సీట్లను గెలుచుకుంటుందన్న రేవంత్
- సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని వ్యాఖ్య
- పదవుల మీద ఆశ లేదు కాబట్టే 20 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నానన్న రేవంత్
ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీనే గెలవబోతోందని చెపుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతోందని తెలిపిందని చెప్పారు. కాంగ్రెస్ 80కి పైగా సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ… కాంగ్రెస్ తరపున గెలిచే 80 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం అభ్యర్థులేనని చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని… అధిష్ఠానం నిర్ణయమే తమకు శిరోధార్యమని అన్నారు.
తాను ఎప్పుడూ పదవులు ఆశించలేదని… అధికారం కావాలని ఆశిస్తే తాను అధికార పక్ష పార్టీల్లో కీలక పదవుల్లో ఉండేవాడినని రేవంత్ చెప్పారు. పదవులు ఆశించలేదు కాబట్టే… పీసీపీ చీఫ్ గా ఉన్నానని, 20 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నానని తెలిపారు. గతంలో తనకు వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్ లు ఆఫర్లు ఇచ్చారని… కానీ, వాటిని తాను తిరస్కరించానని చెప్పారు. తనకు ప్రజాసేవ చేయడమే ముఖ్యమని అన్నారు. ఇండిపెండెంట్ గా తాను జడ్పీటీసీ, ఎమ్మెల్సీగా గెలిచానని… రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందానని చెప్పారు.