- పోరాటాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని వ్యాఖ్య
- తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ప్రజలు ఎప్పటికీ వదులుకోలేరన్న కేటీఆర్
- కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన మాట్లాడుదామని సూచన
ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం పట్ల ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, మన పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. పోరాటాలు మనకు కొత్త ఏమీ కాదన్నారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ఆ రెండింటిని ప్రజలు ఎప్పటికీ వదులుకోలేరన్నారు.
ప్రస్తుత ఓటమి తాత్కాలికంగా స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఇది స్వల్పకాలం మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఫలితాలపై నిరాశ అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన మాట్లాడుదామన్నారు. పవర్ పాలిటిక్స్‌లో అధికారం రావడం, పోవడం సహజమే అన్నారు. ప్రజలు మనకు కూడా రెండుసార్లు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తామని, సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, మందుపంచనని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు.