- 2014లో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రాందులార్ గోండ్
- ఈ కేసులో ఇటీవల ఎమ్మెల్యేను దోషిగా తేల్చిన న్యాయస్థానం
- నిన్న జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు
- అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోనున్న ఎమ్మెల్యే
బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఘటన జరిగిన 9 సంవత్సరాల తర్వాత దోషిగా తేలి శిక్ష కూడా పడడంతో అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా ఆయన కోల్పోనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోన్‌భద్ర జిల్లాలోని దుద్ధి నియోజకవర్గ గిరిజన ఎమ్మెల్యే రాందులార్ గోండ్ 4 నవంబర్ 2014లో బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై మయోర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
గతేడాది ఈ కేసు సోన్‌భద్రలోని ఎంపీ-ఎమ్మెల్యేల కోర్టుకు బదిలీ అయింది. ఈ కేసులో మంగళవారం అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. నిన్న శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 25 ఏళ్ల జైలు శిక్షతోపాటు పది లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలికి అందజేయాలని ఆదేశించింది. గోండ్‌కు శిక్ష పడడంపై బాధిత బాలిక కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎమ్మెల్యే గోండ్‌పై అనర్హత వేటు పడనుంది.