- ముఖ్యమంత్రి నివాసానికి రఘురాం రాజన్
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై చర్చ
- డిప్యూటీ సీఎం భట్టి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కలుసుకున్నారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన రాజన్.. సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించిన రఘురాం రాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై వారు చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తన నివాసానికి వచ్చిన రఘురాం రాజన్ ను సీఎం రేవంత్ రెడ్డి ముందుగా శాలువాతో సత్కరించారు. భట్టి, శ్రీధర్ బాబుతో కలిసి బొకేతో రాజన్ ను స్వాగతించారు. అనంతరం రాష్ట్రంలో ఆర్థిక సమస్యలపై చర్చించినట్లు సమాచారం. నిధుల సమీకరణకు అనుసరించాల్సిన విధానాలపై రఘురాం రాజన్ సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం, మంత్రులతో పాటు సీఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.