- పాస్‌బుక్‌లో జగన్ ఫొటోలు ఎందుకని ప్రశ్నించిన నారాయణ
- సీపీఐతో పొత్తు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్య
- మూడు రాష్ట్రాలలో ఒంటెత్తు పోకడల వల్ల కాంగ్రెస్ ఓడిపోయిందని విమర్శ
ధరణి పేరుతో మాజీ సీఎం కేసీఆర్ చేసిన మోసం కంటే ఏపీలో జగన్ ఎక్కువగా తప్పులు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ, ఏపీలలో ఒక్కో లోక్ సభ స్థానంలో సీపీఐ పోటీ చేయనుందన్నారు. సీపీఐతో పొత్తు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ఒంటెత్తు పోకడ వల్లే ఓడిపోయిందని విమర్శించారు. తెలంగాణలో అందరినీ కలుపుకుపోవడం వల్ల గెలిచిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. ఇండియా కూటమి ఎంత అవసరమో… కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవడం అంతే అవసరమన్నారు.
ఏపీ గురించి మాట్లాడుతూ… పాస్‌బుక్‌లో జగన్ ఫొటోలు ఎందుకు? శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా? అని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో సీఎం జగన్ సమాధి రాయి వేసుకున్నారని, జగన్‌పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. బీజేపీ తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా జగన్ ఉన్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పూరితంగా కాకుండా వర్క్ పూరితంగా మార్పులు చేసుకోవాలని సూచించారు. పదవీ విరమణ పొందిన అధికారులకు ఏ బాధ్యతలు కట్టబెట్టకూడదన్నారు.