Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ఐపీఎల్ ఆటగాళ్లకు వేలంలో కాసుల వర్షం …మిచెల్ స్టార్క్ కు 24 . 75 కోట్లు

కమిన్స్ రికార్డు గంటలోనే బద్దలు… ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఇతనే!

  • దుబాయ్ లో ఐపీఎల్ మినీ వేలం
  • బద్దలవుతున్న కొనుగోళ్ల రికార్డులు
  • రూ.20.50 కోట్లతో చరిత్ర సృష్టించిన ప్యాట్ కమిన్స్
  • రూ.24.75 కోట్లతో కమిన్స్ రికార్డు తిరగరాసిన మిచెల్ స్టార్క్
  • స్టార్క్ ను కొనుగోలు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్
Mitchell Starc breaks Cummins record as IPL Most costliest player ever

దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలంలో రికార్డులు బద్దలవుతున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను రూ.20.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే… వామ్మో, అంత ధరా! అంటూ అందరూ నోర్లు తెరిచారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు కమిన్స్ అంటూ మీడియాలోనూ హోరెత్తిపోయింది. ఇప్పుడా రికార్డు గంటలోనే బద్దలైంది. 

ఆస్ట్రేలియాకే చెందిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇవాళ్టి వేలంలో స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కనీవినీ ఎరుగని రీతిలో రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. 

స్టార్క్ కనీస ధర రూ.2 కోట్లు కాగా… వేలంలో ఈ లెఫ్టార్మ్ పేసర్ కోసం కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే, చివరికి కోల్ కతా ఫ్రాంచైజీదే పైచేయి అయింది. ఎలాంటి పిచ్ పై అయినా ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడని స్టార్క్ కు పేరుంది. 

విచిత్రం ఏమిటంటే… ఆసీస్ జట్టులో స్టార్క్ తో కలిసి ఎన్నో ఏళ్లుగా కొత్త బంతిని పంచుకుంటున్న మరో పొడగరి పేసర్ జోష్ హేజెల్ వుడ్ ను ఇవాళ్టి వేలం తొలి దశలో ఎవరూ కొనుగోలు చేయలేదు. అతడు అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. 

ఇక, టీమిండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ను రూ.5.8 కోట్లతో గుజరాత్ టైటాన్స్ చేజిక్కించుకుంది. ఉమేశ్ కనీస ధర రూ.2 కోట్లు. 

అనూహ్య రీతిలో వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ కోసం ఫ్రాంచైజీలు విపరీతంగా పోటీపడ్డాయి. అతడి కనీస ధర రూ.1 కోటి కాగా… చివరికి అతడిని రూ.11.5 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. అల్జారీ జోసెఫ్ గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో ఆడుతున్నా… గొప్పగా బౌలింగ్ ప్రదర్శన చేసిందేమీ లేదు. అయినా అతడికి కళ్లు చెదిరే ధర లభించడం విశేషం. 

టీమిండియా టెస్టు జట్టు వికెట్ కీపర్ కేఎస్ భరత్ ది విచిత్రమైన గాథ. అతడి కనీస ధర రూ.50 లక్షలు కాగా, అదే ధరకు వేలంలో అతడిని కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.

దక్షిణాఫ్రికా యువ కెరటం ట్రిస్టాన్ స్టబ్స్ కు ఈసారి వేలంలో ఏమంత మంచి ధర లభించలేదు. అతడిని రూ.50 లక్షల కనీస ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ చేజిక్కించుకుంది.

Related posts

వరల్డ్ కప్ లో సెంచరీల మోతమోగించిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు … 5 వికెట్లకు 428 పరుగులు…

Ram Narayana

టీ20 వరల్డ్ కప్: ఆఫ్ఘనిస్థాన్ ఓటమి… టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతు!

Drukpadam

ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో!

Drukpadam

Leave a Comment