- దుబాయ్ లో ఐపీఎల్ వేలం
- శుభమ్ దూబేని రూ.5.8 కోట్లకు సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్
- ఇప్పటివరకు టీమిండియాకు ఆడని దూబే
బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ తో అనేక మంది క్రికెటర్లు కోటీశ్వరులయ్యారు. ఐపీఎల్ లో గురి కుదరాలే కానీ… కాసుల వర్షం కురుస్తుంది. కనీసం జాతీయ జట్టుకు ఒక్క మ్యాచ్ ఆడని వాళ్లపైనా ధనరాశులు కుమ్మరించడం ఐపీఎల్ లోనే చూస్తుంటాం. అందుకు శుభమ్ దూబే అనే యువ ఆటగాడు సరైన నిదర్శనం.
శుభమ్ దూబే విదర్భ క్రికెటర్. అతడి తండ్రి బద్రీ ప్రసాద్ ఓ పాన్ దుకాణం యజమాని. ఒకప్పుడు క్రికెట్ కిట్ కొనడానికి కూడా డబ్బుల్లేని స్థితి నుంచి నేడు ఐపీఎల్ లో ఆడేంత వరకు దూబే ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. సుదీప్ అనే వ్యక్తి చేసిన సాయంతో దూబే క్రికెట్ లో ఎదిగాడు. సుదీప్ కిట్ కొనివ్వడంతో దూబే ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ తరఫున అండర్-19, అండర్-23 జట్లకు ఆడుతూ తానేంటో నిరూపించుకున్నాడు.
దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ వేలంలో శుభమ్ దూబేని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.5.8 కోట్లతో కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్ లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రాణించడం దూబేను ఐపీఎల్ వరకు తీసుకువచ్చింది.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 187 స్ట్రయిక్ రేట్ తో అదరగొట్టాడు. ఈ సగటు చాలు అతడి హిట్టింగ్ పవర్ ఎలాంటిదో చెప్పడానికి. అందుకే వేలంలో దూబే కోసం ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ భారీ మొత్తంతో అతడిని సొంతం చేసుకుంది.