తెలంగాణ అప్పు రూ.3.17 లక్షల కోట్లే.. కేటీఆర్
6 లక్షల 71 వేలు కోట్లు అంటున్న అధికార కాంగ్రెస్
- ప్రభుత్వం మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఫైర్
- శ్వేత పత్రానికి కౌంటర్ గా స్వేద పత్రం విడుదల
- బీఆర్ఎస్ పాలన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని వ్యాఖ్య
తెలంగాణ అప్పుల లెక్కలు …6 లక్షల 71 వేలు కోట్లు అంటున్న అధికార కాంగ్రెస్ …లేదు తప్పుడు లెక్కలు వాస్తవంగా తెలంగాణ అప్పు రూ.3.17 లక్షల కోట్లే అంటున్న బీఆర్ యస్ …ఈమేరకు మొన్న అసెంబ్లీలో అధికార పార్టీ శ్వేతపత్రం ప్రకటించగా నేడు బీఆర్ యస్ కార్యాలయం తెలంగాణ భవన్ ఆపార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు …ప్రభుత్వం తమను బదనాం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక లెక్కలను తప్పుడుగా చూపుతుందని మమ్మలను తిడితే అభ్యంతరం లేదు కానీ తమ రక్తాన్ని చెమటగా చేసి పోగుపెట్టిన సంపదను తప్పుగా చూపించవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు కేటీఆర్ … పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక లెక్కలు సంపదపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు …దీంతో ఏది నిజం …? ఏది అబద్దం అనేది తేల్చుకోవడం తెలంగాణ ప్రజల వంతు అయింది …
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పాలన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పదేళ్ల ప్రగతిపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా తెలంగాణ భవన్ లో ఆదివారం ‘స్వేద పత్రం’ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అప్పు కేవలం రూ.3.17 లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం అప్పులను ఎక్కువ చేసి చూపిస్తోందని ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తమను బదనాం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.
తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై తెలంగాణ భవన్ లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని ఇదే కాంగ్రెస్ నేతలు విధ్వంసం చేశారని ఆరోపించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించిన బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శ్వేతపత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రంలో పేర్కొన్న అప్పుల గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణ మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లని చెప్పడం పూర్తిగా అబద్దమని కేటీఆర్ చెప్పారు. 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లు ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ అప్పు 3.17 లక్షలకు చేరిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులను, జరిగిన అభివృద్ధిని పోల్చి చూడాలని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలతో ప్రత్యేక రాష్ట్రంలో పేదరికం తగ్గి తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. 2013లో తెలంగాణ ప్రాంతంలో పేదరికం 21 శాతం ఉండగా.. 2023 నాటికి ప్రత్యేక రాష్ట్రంలో పేదరికం 5శాతానికి తగ్గిందని వివరించారు. 2014లో 1.14 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం ప్రస్తుతం 3.17 లక్షలకు చేరిందని కేటీఆర్ తెలిపారు.