మా పార్టీ బలంగా ఉంది కాబట్టే ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్నారు: సజ్జల
- పలు నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చుతున్న వైసీపీ
- ఆశావహులను కూర్చోబెట్టి మాట్లాడతామన్న సజ్జల
- వచ్చే ఎన్నికల్లో తమకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని ధీమా
ఏపీ అధికారపక్షం వైసీపీ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్చుతుండడం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏ పార్టీలో అయినా టికెట్లను కోరుకునే ఆశావహులు ఉంటారని, వారికి మద్దతు ఇచ్చే వాళ్లు ఉంటారని తెలిపారు.
ఒక పార్టీ బలంగా ఉందంటే, అందులో నాయకులు ఎక్కువ మంది ఉన్నట్టు అర్థం… దాంతో టికెట్లను ఆశించే వారి తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా, ఎవరికైనా టికెట్ ఇస్తే ఎవరూ అభ్యంతర పెట్టకపోయినా, ఎవరూ ఎవరినీ వ్యతిరేకించకపోయినా అది దివాలా తీసిన పార్టీగానే భావించాలని సజ్జల పేర్కొన్నారు.
తమ పార్టీలో ఎక్కువమంది నాయకులు ఉన్నారు కాబట్టే ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని, అలాంటి వారందరినీ కూర్చోబెట్టి మాట్లాడతామని తెలిపారు. వారందరినీ ఒకే తాటిపైకి తీసుకువస్తామని చెప్పారు. ఏదో జరిగిపోతోందంటూ దీని గురించి ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని, ఎన్నికల్లో తమ పార్టీకి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.