- ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆర్కే
- పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన
- పొమ్మనలేక పొగబెట్టారంటూ కీలక నేతలపై ఫైర్
సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలతోనే రాజకీయ ప్రయాణం చేస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) శనివారం సంచలన ప్రకటన చేశారు. వైసీపీలో తనకు ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ను ఓడించిన తనను పార్టీ పెద్దలు పట్టించుకోలేదని చెప్పారు. పార్టీలో నుంచి పొమ్మనలేక పొగ బెట్టారని, గత్యంతరం లేక వైసీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు.
మంగళగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. అయితే, సీఎం జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. తన నియోజకవర్గానికి నిధులు కూడా కేటాయించలేదని చెప్పారు. చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. అందువల్లే వైసీపీకి రాజీనామా చేశానని, ఇకపై వైఎస్ షర్మిలతోనే కలిసి నడుస్తానని వివరించారు.
ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని ఆర్కే వివరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలను ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నించారు. అందుకే, తన సొంత డబ్బులతో కొన్ని పనులు చేసినట్లు వివరించారు. నైతిక విలువలను పాటించే నేతగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చానని తెలిపారు. సీఎం జగన్ తప్పులు చేస్తే కేసులు వేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.