నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు.. అజ్ఞాతంలోకి జయప్రద!
- గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన జయప్రద
- ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ఆమెపై కేసు
- కోర్టు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాని వైనం
- తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన రాంపూర్ కోర్టు
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద గత ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేశారు. అయితే, ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందంటూ కేసు నమోదైంది. ఈ కేసులో జయప్రదపై ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఇప్పటికే అనేక పర్యాయాలు జయప్రద విచారణకు గైర్హాజరయ్యారు. కోర్టు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో రాంపూర్ కోర్టు జయప్రదపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనవరి 10 లోపు ఆమెను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు జయప్రద కోసం గాలిస్తున్నాయి. జయప్రద మిస్సింగ్ అంటూ జాతీయ మీడియాలో ఇప్పటికే కథనాలు వచ్చాయి. వీటిపై ఇప్పటివరకు జయప్రద నుంచి స్పందన లేదు.