- లక్షద్వీప్ లో పర్యటించిన ప్రధాని మోదీ
- ఇకపై టూరిస్టులు తమ జాబితాలో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోవాలని పిలుపు
- మోదీ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తున్న మాల్దీవుల నేతలు
- మాల్దీవులతో ఎప్పటికీ భారత్ పోటీ పడలేదన్న ఎంపీ జహీద్
- ఆవు పేడతో చేసిన లడ్డూకు, భారత్ కు తేడా లేదన్న మాల్దీవుల మంత్రి
సోషల్ మీడియాలో ఇప్పుడు మాల్దీవులు వర్సెస్ భారత్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. దీనికంతటికీ కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల డిప్యూటీ మంత్రి మరియమ్ షివునా, ఎంపీ జహీద్ రమీజ్ చేసిన వ్యాఖ్యలే.
ప్రధాని మోదీ లక్షద్వీప్ లోని సుందరమైన బీచ్ లలో పర్యటించి, స్నార్కెలింగ్ చేశారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో వివరిస్తూ… అడ్వెంచర్ టూరిజం చేయాలనుకునే పర్యాటకులు ఇకపై తమ జాబితాలో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
అయితే, మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ స్పందిస్తూ… టూరిజంలో భారత్ ఎప్పటికీ తమతో పోటీ పడలేదని, అలా పోటీ పడగలం అనుకుంటే అది వాళ్ల భ్రమేనని ట్వీట్ చేశాడు. టూరిస్టులకు మాల్దీవులు అందించే సేవలను భారత్ ఎన్నటికీ అందించలేదని, అక్కడి గదుల్లో శాశ్వతంగా ఉండే మురికి వాసన అతి పెద్ద సమస్య అని విమర్శించాడు. భారత్ ను అపరిశుభ్ర దేశంగా అభివర్ణించాడు.
డిప్యూటీ మినిస్టర్ మరియం షివునా స్పందిస్తూ… ఆవుపేడతో చేసిన లడ్డూకు, భారత్ కు తేడా లేదని ఎద్దేవా చేశారు. దాంతో, భారత ప్రముఖులు, నెటిజన్లు మాల్దీవులపై విరుచుకుపడుతున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు.
మాల్దీవులకు చెందిన ఓ డిప్యూటీ మంత్రి మన దేశాన్ని ఉద్దేశించి ఎంతో చవకబారు వ్యాఖ్యలు చేశారని వెంకటేశ్ ప్రసాద్ మండిపడ్డారు. మాల్దీవులు ఒక కటిక పేద దేశం అని, టూరిజంపైనే ఎక్కువగా ఆధారపడుతుందని తెలిపారు. ఆ దేశానికి వెళ్లే టూరిస్టుల్లో 15 శాతం భారతీయులేనని వివరించారు. భారత్ లో అనేక అందమైన తీర ప్రాంత పట్టణాలు ఉన్నాయని, వాటిని పర్యాటకులకు అనువుగా మార్చేందుకు ఇదే సరైన తరుణం అని అభిప్రాయపడ్డారు.
అక్షయ్ కుమార్ కూడా ఇదే రీతిలో స్పందించారు. మాల్దీవులకు చెందిన చాలామంది నేతలు భారత్ పై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడాన్ని గమనిస్తున్నానని వెల్లడించారు. మాల్దీవులకు అత్యధిక శాతం టూరిస్టులు భారత్ నుంచే వెళుతున్నారని, అలాంటి దేశంపై మాల్దీవులకు చెందిన వారు వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.
భారత్ తన పొరుగుదేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోందని, కానీ ఇలా అకారణంగా విద్వేషభరిత వ్యాఖ్యలను ఎందుకు సహించాలి? అని మండిపడ్డారు. “నేను కూడా చాలాసార్లు మాల్దీవులకు వెళ్లాను… చాలా బాగుంది అని ప్రశించాను. కానీ హుందాగా ఉండడం ముఖ్యం. ఇదే సరైన సమయం… మన భారతదేశానికి చెందిన దీవులను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. మన పర్యాటక రంగానికి మద్దతుగా నిలవాలి” అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.
కాగా, ఎంపీ జహీద్ రమీజ్ చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ ఎంపీ చేసిన వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలు ఆ ఎంపీ వ్యక్తిగతం అని, కానీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతినేలా ఉపయోగించడం సరికాదని హితవు పలికింది. అంతర్జాతీయ ద్వైపాక్షిక భాగస్వాములతో సంబంధాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం అని హెచ్చరించింది.