- యుద్ధం మరిన్ని ప్రాంతాలకు వ్యాపించొచ్చని ఆంటొనీ బ్లింకెన్ ఆందోళన
- ఇది యావత్ మధ్యప్రాచ్య భద్రతకూ ముప్పుగా మారొచ్చని హెచ్చరిక
- ఇజ్రాయెల్ తన ప్రణాళికల్లో గాజా పౌరుల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మరింతగా విస్తరించి, మధ్యప్రాచ్యంలో భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖతర్‌లో పర్యటన సందర్భంగా బ్లింకెన్ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం అక్కడ (గాజా) ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించి, అభద్రత, ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది’’ అని ఆయన దోహాలో జరిగిన ఓ పత్రికా సమావేశంలో పేర్కొన్నారు.
సాధారణ పౌరుల రక్షణ, మానవతా సాయానికి వీలు కల్పించేలా ఇజ్రాయెల్ తన మిలిటరీ మిషన్స్‌ను రూపొందించుకోవాలని సూచించారు. పౌరులు వీలైనంత త్వరగా తమ స్వస్థలాలకు చేరుకునేలా చూడాలని అభిప్రాయపడ్డారు. గాజా వీడాలని వారిని బలవంత పెట్టకూడదని కూడా స్పష్టం చేశారు. గాజాలో ఇద్దరు అల్ జజీరా న్యూస్ నెట్వర్క్ జర్నలిస్టుల మృతిపై కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇది ఊహకందని విషాదమని వ్యాఖ్యానించారు.
మంత్రి బ్లింకెన్ తొలుత జోర్డాన్, టర్కీ, గ్రీస్‌లో పర్యటన ముగించుకుని ఆదివారం ఖతర్ చేరుకున్నారు. ఆదివారం రాత్రి అబుదాభీకి వెళ్లిన ఆయన సోమవారం సౌదీ పర్యటనలో పాల్గొంటారు. మంత్రి బ్లింకెన్ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అవుతారని అమెరికా వర్గాలు తెలిపాయి.