- మాలే నగర మేయర్ ఎన్నికల్లో భారత అనుకూల ఎమ్‌డీపీ పార్టీ విజయం
- అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌పై ఎమ్‌డీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపు
- భారత్‌తో దౌత్య వివాదం నేపథ్యంలో ఓటమి చవిచూసిన అధికార పార్టీ
భారత్‌తో దౌత్యవివాదం కొనసాగుతున్న తరుణంలో మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన మాలే నగర మేయర్ ఎన్నికల్లో భారత్ అనుకూల మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎమ్‌డీపీ)..అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌పై ఘన విజయం సాధించింది. ఎమ్‌డీపీ అభ్యర్థి ఆదమ్ అజీమ్ ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. భారత్ అనుకూలుడిగా పేరు పడ్డ ముహమ్మద్ సోలీ ఎమ్‌డీపీకి నేతృత్వం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన చైనా అనుకూలుడైన ముహమ్మద్ ముయిజ్జు చేతిలో ఓటమి చవిచూశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టకమునుపు ముయిజ్జు మాలే మేయర్‌గా సేవలందించారు. ఈ నేపథ్యంలో మాలేలో ప్రతిపక్ష పార్టీ నేత మేయర్‌గా ఎన్నికవడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌తో దౌత్యవివాదంతో ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డ అధ్యక్షుడికి ఈ ఓటమి తలనొప్పిగా మారింది.
మాలే మేయర్ ఎన్నికల్లో ఎమ్‌డీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందారని స్థానిక మీడియా చెప్పింది. ఆయన విజయం నల్లేరు మీద నడకేనని వ్యాఖ్యానించింది. కాగా, ఈ విజయంతో ప్రతిపక్ష ఎమ్‌డీపీకి మంచి ఊపు నిస్తుందని అక్కడి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
లక్షద్వీప్ పర్యటన అనంతరం ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామంపై భారత్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో నష్టనివారణ చర్యలకు దిగిన అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించారు. ఆ తరువాత చైనా పర్యటనకు వెళ్లి తిరిగొచ్చిన అధ్యక్షుడు ముయిజ్జు మాలే ఎన్నికల్లో ఓటమి వార్త వినాల్సి వచ్చింది.