- గత నెలలో హత్యకు గురైన బీఆర్ఎస్ నేత మల్లేశ్ యాదవ్
- మల్లేశ్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేటీఆర్ విమర్శలు
- వ్యక్తిగత కారణాలు, భూతగాదాల కారణంగా మల్లేశ్ హత్య జరిగిందని జూపల్లి కౌంటర్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణంగా పండుగపూట కూడా ప్రెస్‌మీట్ పెట్టవలసి వచ్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హత్యా రాజకీయాలు అంటూ కేటీఆర్ మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. గత డిసెంబర్ నెలలో కొల్లాపూర్‌లో మల్లేశ్ యాదవ్ అనే వ్యక్తి తన బంధువుల చేతిలో హత్యకు గురైనట్లు జూపల్లి తెలిపారు. ఈ హత్య వ్యక్తిగత కారణాలు… భూతగాదాల కారణంగా జరిగినట్లు వెల్లడించారు. కానీ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆ హత్యను తెరపైకి ఎందుకు తీసుకు వస్తున్నారు? అని ప్రశ్నించారు. హంతకులను తాము తప్పకుండా శిక్షిస్తామన్నారు.
ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే కొంతమంది పోలీసుల అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. మల్లేశ్ యాదవ్ బీజేపీ సానుభూతిపరుడని… ఎన్నికలకు ముందు ఆయన బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు. తాను మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని అన్నారు. 1999 నుంచి తాను పోటీ చేస్తూ వస్తున్నానని… మెజార్టీ ప్రతిసారి పెరుగుతూ వస్తోందని గుర్తు చేశారు. ఎన్నికల కోసం కేటీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని ఓ కాంగ్రెస్ సర్పంచ్‌ని బీఆర్ఎస్ వారు హత్య చేశారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు.
బీఆర్ఎస్ హయాంలో తన నియోజకవర్గంలో చాలామంది హత్యకు గురయ్యారన్నారు. ఇప్పుడు మల్లేశ్ యాదవ్ హత్య విషయంలో కేటీఆర్ తనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారన్నారు. గతంలో తన నియోజకవర్గంలో హత్యలపై సాక్ష్యాధారాలతో సహా డీజీపీకి అందించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. కొండగట్టు దుర్ఘటనలో 60 మంది చనిపోతే బీఆర్ఎస్ వారు వెళ్లి కనీసం పరామర్శించలేదని గుర్తు చేశారు. వామనరావు దంపతుల హత్య, మరియమ్మ ఘటన, దిశ ఘటన… ఇలా ఎన్నో ఉదంతాలు ఉన్నాయన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావ్ పల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన మల్లేశ్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హత్యా రాజకీయాలు మంచివి కావని సూచించారు. అయితే, మల్లేశ్ హత్యను రాజకీయం చేస్తున్నది ఎవరంటూ జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.