- పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరైన సీఎం బృందం
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో రేవంత్ భేటీ
- సీఎం వెంట దావోస్ వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సోమవారమే దావోస్ చేరుకున్న ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అధ్యక్షుడు బొర్గేబ్రెండెతో సోమవారం సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ‘ఎక్స్’ వేదికగా రేవంత్ షేర్ చేశారు. మనుషుల జీవన శైలి పరిస్థితులను మరింత మెరుగ్గా, సుసంపన్నంగా మెరుగుపరచేందుకు ప్రభుత్వాలు, వాణిజ్య సంస్థలు, ఇతర భాగస్వాములు ఏవిధంగా ఉమ్మడిగా పనిచేయగలవనే అంశంపై చర్చించినట్టు రేవంత్ వెల్లడించారు. మరోవైపు ఇథియోపియో డిప్యూటీ ప్రధానమంత్రి డెమెకే హసెన్‌ను కూడా కలిసినట్టుగా సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన పంచుకున్నారు.
దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు అధికారులు ఉన్నారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో రేవంత్ రెడ్డి జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు చేరారు. ఇదిలావుంచితే.. సీఎం రేవంత్ రెడ్డి సూటుబూటు ధరించి ఆకర్షించారు.