Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

పాలసముద్రంలో ‘నాసిన్’ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ… హాజరైన సీఎం జగన్

  • పాలసముద్రంలో ‘నాసిన్’ అకాడమీ ఏర్పాటు
  • ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని మోదీ
  • ఒక గొప్ప సంస్థను ప్రారంభించడం ఆనందంగా ఉందన్న ప్రధాని
  • ఏపీకి ఇలాంటి అకాడమీ రావడం గర్వంగా ఉందన్న సీఎం జగన్

ప్రధాని నరేంద్ర మోదీ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పాలసముద్రంలో స్థాపించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కొటిక్స్ (NACIN) ను ప్రారంభించారు. రిమోట్ బటన్ నొక్కి ‘నాసిన్’ ను జాతికి అంకితం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ… చారిత్రక ప్రదేశంలో ‘నాసిన్’ (NACIN) ను ఏర్పాటు చేయడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఒక గొప్ప సంస్థను ప్రారంభించడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో పన్నుల విధానం గందరగోళంగా ఉండేదని, జీఎస్టీ తీసుకువచ్చి పన్నుల విధానాన్ని సరళీకృతం చేశామని అన్నారు. ప్రజలు చెల్లించే పన్నులు తిరిగి ప్రజల సంక్షేమానికే వినియోగించాలని, ఇదే రామరాజ్య సందేశం అని మోదీ పేర్కొన్నారు. రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మా గాంధీ చెప్పారని వెల్లడించారు. కాగా, అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం 11 రోజుల అనుష్ఠానం చేస్తున్నానని తెలిపారు. 

అంతకుముందు, పాలసముద్రం నాసిన్ క్యాంపస్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు మోదీ వాయుసేన హెలికాప్టర్ లో చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్… ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. ‘నాసిన్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ కూడా ప్రసంగించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘నాసిన్’ వంటి అంతర్జాతీయ స్థాయి ఇన్ స్టిట్యూట్ రావడం గర్వంగా ఉందని అన్నారు. ‘నాసిన్’ తో ఏపీకి ప్రపంచస్థాయి గుర్తింపు రానుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప అకాడమీని ఏర్పాటు చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. 

రాష్ట్ర విభజన కేటాయింపుల్లో భాగంగా ఏపీకి ‘నాసిన్’ రెండో కేంద్రాన్ని కేటాయించారు. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద 44వ నెంబరు జాతీయ రహదారికి సమీపంలో దీన్ని నాసిన్ కేంద్రాన్ని నిర్మించారు. 

దేశంలో ఐఏఎస్ లకు ముస్సోరీలో, ఐపీఎస్ లకు హైదరాబాద్ అకాడమీలో శిక్షణ ఇస్తున్నట్టే… ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్)కు ఎంపికైన వారికి ‘నాసిన్’ లో శిక్షణ ఇస్తారు. దాదాపు 503 ఎకరాల విస్తీర్ణంలో రూ.541 కోట్ల వ్యయంతో ఈ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు.

Related posts

ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత… రోడ్డుపై బైఠాయించిన సీఎం కేజ్రీవాల్…

Ram Narayana

వందే భారత్ వర్సెస్ వందే మెట్రో.. తేడాలు ఏమిటి?

Ram Narayana

భారీ భద్రత నడుమ బాబా సిద్ధిఖీ నివాసానికి వచ్చిన సల్మాన్ ఖాన్!

Ram Narayana

Leave a Comment