- ప్రజల నుంచే వచ్చే సూచనలతో ప్రజా మేనిఫెస్టోను సిద్ధం చేస్తామన్న చిదంబరం
- సలహాలను awaazbharatki@inc.in మెయిల్‌కు పంపించవచ్చునని వెల్లడి
- www.awaazbharatki.inని సందర్శించి నేరుగా అప్‌లోడ్ చేయవచ్చని సూచన
2024 లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఏమేం అంశాలు చేర్చాలనే విషయమై ప్రజల నుంచి సూచనలను, సలహాలను ఆహ్వానించింది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మేనిఫెస్టో కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. తమది ప్రజల మేనిఫెస్టో అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ప్రజల నుంచి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చిదంబరం తెలిపారు. ప్రతి రాష్ట్రంలోని మేనిఫెస్టో కమిటీ సభ్యులు ప్రజలతో సంప్రదింపులు జరుపుతారని తెలిపారు. అలాగే ప్రజలు తమ సూచనలు, సలహాలు పంపించేందుకు ఓ ప్రత్యేక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
awaazbharatki@inc.inకు సలహాలను పంపించవచ్చునని లేదా www.awaazbharatki.inని సందర్శించి నేరుగా అప్‌లోడ్ చేయవచ్చని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఎవరికోసమైతే మేనిఫెస్టోను తయారు చేస్తున్నామో.. వారి నుంచి తాము సలహాలను స్వీకరించాలని నిర్ణయించామని కమిటీ కన్వీనర్, ఛత్తీస్‌గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో పేర్కొన్నారు.
కాంగ్రెస్ కేవలం పార్టీ కాదని… ఇది ప్రజా గొంతుక అని.. అందుకే సాధారణ పౌరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సాధారణ పౌరుల జీవితాలను మార్చడానికి అర్థవంతమైన విధానాలను తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. అందుకే 2024 మేనిఫెస్టో ఎలా ఉండాలో.. ప్రజల నుంచి సూచనలను కోరుతున్నట్లు తెలిపారు. మీ సలహాలను https://awaazbharatki.in ద్వారా సమర్పించాలని ట్వీట్ చేశారు. 16 మంది సభ్యులు కలిగిన మేనిఫెస్టో కమిటీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ వాద్రా ఉన్నారు.