- ఎన్ని గిమ్మిక్కులు చేసినా విజిలెన్స్, సిట్టింగ్ జడ్జితో విచారణను అడ్డుకోలేరన్న కోమటిరెడ్డి
- పారాగాన్ స్లిప్పర్లు వేసుకొని తిరిగే వ్యక్తికి వేలకోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్రశ్న
- నిత్యం ప్రజల్లో ఉండే తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్న కోమటిరెడ్డి
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు పోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది జగదీశ్ రెడ్డి అని అన్నారు. ప్రజల్లో ఉండే తనపై మాజీ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా విజిలెన్స్, సిట్టింగ్ జడ్జితో విచారణను అడ్డుకోలేరన్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత జగదీశ్ రెడ్డి కూడా ఖాయంగా జైలుకు వెళతారన్నారు.
పారాగాన్ స్లిప్పర్లు వేసుకొని తిరిగే వ్యక్తికి వేలకోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్రశ్నించారు. అన్ని ఫామ్ హౌస్‌లు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు వీటి గురించి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ కుటుంబంలో బావాబావమరుదులు తన్నుకుంటుంటే విషయం బయటకు పొక్కకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకునే సమయంలో జగదీశ్ రెడ్డి బ్రోకర్‌లా వ్యవహరించారని ఆరోపించారు. ఇలాంటి చిల్లర వ్యక్తి… నిత్యం ప్రజల్లో ఉండే తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.