- ఇటీవల చంద్రబాబును కలిసిన ప్రశాంత్ కిశోర్
- తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించిన పీకే
- తాను ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త పనికి దూరంగా ఉన్నట్టు స్పష్టీకరణ
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఈసారి టీడీపీతో కలిసే అంశంపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ప్రశాంత్ కిశోర్ ను హైదరాబాద్ నుంచి నారా లోకేశ్ స్వయంగా వెంటబెట్టుకుని విజయవాడ రావడంతో టీడీపీ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.
అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చంద్రబాబుకు, తనకు ఓ నేత కామన్ ఫ్రెండ్ గా ఉన్నారని… చంద్రబాబు ఎప్పటినుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడని ఆ నేత చెప్పడంతో, తాను ఆ రోజు నారా లోకేశ్ తో కలిసి విజయవాడ వచ్చానని వివరించారు.
చంద్రబాబుతో భేటీపై యాంకర్ ప్రశ్నించగా… వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయాలని చంద్రబాబు కోరారని, తనకు వీలుపడదని చెప్పానని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ కోసం పనిచేశానని… ఈసారి ఎన్నికల్లో అటు వైసీపీతో గానీ, ఇటు టీడీపీతో గానీ కలిసి పనిచేయబోనని తేల్చి చెప్పారు.
తాను ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడంలేదని, ఇదే విషయాన్ని కామన్ ఫ్రెండ్ కు చెబితే, చంద్రబాబును స్వయంగా కలిసి ఇదే విషయాన్ని చెప్పాలని ఆ నేత సూచించాడని వివరించారు. ఆ నేత సూచన మేరకే చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చానని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.