- దౌత్య వివాదం వేళ శుభాకాంక్షలు తెలిపిన కెనడా హైకమిషన్
- అమెరికా సహా పలు దేశాల శుభాకాంక్షలు
- గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారత్‌కు కెనడా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని కెనడా హైకమిషన్ కార్యాలయం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం కొనసాగుతోంది. తమ దేశంలో జరిగిన ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ర పాత్ర ఉందని ఆరోపిస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తొలుత వివాదాన్ని రాజేశారు. ఆయన ఆరోపణల్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన భారత్.. తదనంతర పరిణామాల నేపథ్యంలో కెనడా వాసులకు వీసాల జారీని నిలిపివేసింది. అయితే, ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతున్న దర్యాప్తులో కూడా భారత్ పేరును చేర్చి కెనడా..అగ్నికి ఆజ్యం పోసింది. ఇదిలా ఉంటే, దౌత్య వివాదం కారణంగా కెనడాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
ఇక అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాలు కూడా భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న విషయం తెలిసిందే.