ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జలగం …!
టీడీపీకి టికెట్ ఇస్తారని వార్తల నేపథ్యంలో టికెట్ తనకే వస్తుందన్న జలగం
ఖమ్మం లోక్ సభ టిక్కెట్ టీడీపీకి ఇస్తారనేది కేవలం ప్రచారమే అంటున్న జలగం
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి జలగం వెంకట్రావు
రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిసిన జలగం వెంకట్రావు
ఖమ్మం టిక్కెట్ విషయమై వీరిద్దరి మధ్య చర్చ
వరంగల్ టిక్కెట్ ఒక్కటే ఆపితే బాగుండదని ఖమ్మం అభ్యర్థి ప్రకటన కూడా ఆపేశారన్న జలగం వెంకట్రావు
ఖమ్మం బీజేపీ టికెట్ జలగం వెంకట్రావు కు దాదాపు ఖరారు అయింది …ఈవిషయం జలగం వెంకట్రావు స్వయంగా వెల్లడించారు .. ఖమ్మం ఎంపీ సీటు టీడీపీలో పొత్తులో భాగంగా ఆపార్టీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు ..
ఖమ్మం లోక్ సభ టిక్కెట్‌ను బీజేపీ… తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తుందనేది కేవలం ప్రచారం మాత్రమేనని, టిక్కెట్ తనకే వస్తుందని నమ్మకం ఉందని ఖమ్మం జిల్లా నాయకుడు జలగం వెంకట్రావు అన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఖమ్మం పార్లమెంట్ స్థానంపై ఆయన పార్టీ పెద్దలతో చర్చించారు. పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. తనకు ఖమ్మం టిక్కెట్ కేటాయింపుపై మాట్లాడారు.
ఈ భేటీ అనంతరం జలగం వెంకట్రావు విలేకరులతో మాట్లాడుతూ… తాను పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. వరంగల్ టిక్కెట్ ఒక్కటే ఆపితే బాగుండదని ఖమ్మం అభ్యర్థి ప్రకటనను కూడా ఆపేశారని వెల్లడించారు. 17 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. కేవలం వరంగల్, ఖమ్మం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, వరంగల్ నుంచి ఆరూరి రమేశ్‌కు బీజేపీ టిక్కెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.