ఆసక్తికర పరిణామం …తెలంగాణాలో టికెట్ ఆశిస్తున్నా వ్యక్తికీ ఆంధ్రాలో టికెట్
బీజేపీ టికెట్ ఆశిస్తే టీడీపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు!
టీఎస్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ డీజీపీ కృష్ణప్రసాద్
వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్న కృష్ణప్రసాద్
బాపట్ల ఎంపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధికి చంద్రబాబు ఏపీలో ఎంపీ టికెట్ ఇచ్చారు. బాపట్ల ఎంపీ అభ్యర్థిగా మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ ను ప్రకటించారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ను కృష్ణప్రసాద్ ఆశించారు. అయితే, ఆయనకు టికెట్ దక్కలేదు. తాజాగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ ను ఆయన ఆశించారు. చివరకు ఏపీలో బాపట్ల లోక్ సభ స్థానం నుంచి కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు.
టికెట్ ఆశించిన ఉండవల్లి శ్రీదేవికి మొండిచేయి ….
ఇవాళ టీడీపీ మూడో జాబితా ప్రకటించిన అనంతరం, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు ఎలా ఉంటాయో… ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది అని శ్రీదేవి పేర్కొన్నారు. అంతేకాదు, బాపట్ల అని హ్యాష్ ట్యాగ్ పెట్టి కత్తి ఎమోజీ పోస్టు చేశారు. ఉండవల్లి శ్రీదేవి ఈ పోస్టులో ఏ రాజకీయ పార్టీ పేరును ప్రస్తావించనప్పటికీ, ఆమె చేసిన ట్వీట్ ప్రధాన ప్రతిపక్షం గురించే అని అర్థమవుతోంది.
ఉండవల్లి శ్రీదేవి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున శాసనసభ్యురాలిగా గెలిచారు. అయితే, వైసీపీలో ఇతర నేతలతో సఖ్యత చెడడంతో ఆమె టీడీపీకి దగ్గరయ్యారు. ఉండవల్లి శ్రీదేవి దళిత వర్గానికి చెందిన మహిళ కాగా… ఈసారి ఎన్నికల్లో తిరువూరు (ఎస్సీ రిజర్వ్ డ్) అసెంబ్లీ స్థానం కానీ, బాపట్ల ఎంపీ స్థానం కానీ కేటాయిస్తారని ఆమె ఆశించారు.
కానీ, ఇవాళ టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో బాపట్ల ఎంపీ స్థానానికి తెలంగాణ బీజేపీ నేత కృష్ణప్రసాద్ ను తీసుకువచ్చి పోటీ చేయిస్తున్నారు. ఈ పరిణామంతో ఉండవల్లి శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తాజా ట్వీట్ ద్వారా అర్థమవుతోంది.
అటు, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావు బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.